విద్యార్థులకు బిగ్ అలర్ట్.. గురుకుల డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల దరఖాస్తు తేదీ పొడిగింపు

రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్ల కోసం ఏప్రిల్ 28న నిర్వహించే ప్రవేశపరీక్షకు దరఖాస్తు చేసుకునే

Update: 2024-04-10 16:38 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్ల కోసం ఏప్రిల్ 28న నిర్వహించే ప్రవేశపరీక్షకు దరఖాస్తు చేసుకునే చివరి తేదీని మరో మూడు రోజులు పొడిగించారు. తొలి షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 12తో అప్లికేషన్లు స్వీకరణ ముగుస్తుండగా, కొత్త షెడ్యుల్ ప్రకారం దీనికి మరో మూడు రోజులు అదనంగా పెంచారు. 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్, డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే పరీక్ష కోసం ఏప్రిల్ 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని టీజీఆర్డీసి సెట్ కన్వీనర్, తెలంగాణ మహాత్మా జ్యోతిబా ఫులే బీసీ సంక్షేమ గురుకుల సోసైటీ కార్యదర్శి బి సైదులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ రెండవ సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్థులు డిగ్రీ కోర్సుల కోసం ఈనెల 15వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.

డిగ్రీ కాలేజీల్లో రెగ్యులర్ కోర్సులతో పాటు ఒకేషనల్ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ గురుకుల కళాశాలల్లో ప్రవేశం పొందిన విద్యార్థులకు పూర్తి ఉచితంగా విద్యా, భోజన వసతితోపాటు యూనిఫామ్, నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ మొదలైన సదుపాయాలు అందిస్తామని ఆయన తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తమకు నచ్చిన కోర్సులలో చేరడానికి ప్రవేశపరీక్ష రాసేందుకు వీలుగా ఆన్లైన్‌లో tsrdccet.cgg.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. టీజీఆర్డీసీ సెట్ 2024 ప్రవేశ పరీక్ష ఏప్రిల్‌ 28న జరుగుతుందని, ప్రవేశ పరీక్షకు సంబంధించిన హాల్‌ టికెట్లు పరీక్షకు వారం రోజుల ముందుగా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయన్నారు.

ఇక బీసీ సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్ల కోసం ఏప్రిల్ 28న నిర్వహించే ప్రవేశపరీక్షకు దరఖాస్తు చివరి తేదీని ఏప్రిల్ 15 వరకు పొడిగించామని ఎంజేపీ కార్యదర్శి సైదులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 261 జూనియర్ కాలేజీల్లో రెగ్యులర్ కోర్సులతో పాటుగా ఒకేషనల్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని, పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు ఈ సదవకాశాన్ని వినియోగించుకుని ఉన్నత విద్యను అభ్యసించాలని ఆయన సూచించారు. జూనియల్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం టీజీఆర్జేసీ సెట్–2024 ప్రవేశ పరీక్ష ఏప్రిల్‌ 28న జరగుతుందని, హల్ టికెట్లు పరీక్షకు వారం రోజుల ముందుగా వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలని ఆయన తెలిపారు.


Similar News