జడ్చర్లలో ఎన్నికల వేళ బారీగా పేలుడు పదార్థాలు లభ్యం..
ఎన్నికల వేళ జడ్చర్లలో పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు పట్టుబడడం కలకలం రేపింది.
దిశ, జడ్చర్ల : ఎన్నికల వేళ జడ్చర్లలో పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు పట్టుబడడం కలకలం రేపింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ భారీ మొత్తంలో జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు లభ్యం కావడం జడ్చర్ల పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. జడ్చర్ల పట్టణంలోని జయప్రకాష్ నగర్ కాలనీలో ఇండ్ల మధ్యలో ఉన్న ఒక రూమ్‌లో భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు ఉన్నాయనే సమాచారంతో జడ్చర్ల ఎస్సైలు నాగరాజ్, చంద్రమోహన్ రావులు ఎస్‌బి డిపార్ట్‌మెంట్ సంయుక్తంగా జయప్రకాష్ నగర్‌లో ఆకస్మికంగా సోదాలు చేపట్టారు. ఒక రూమ్‌లో 11 బాక్సుల్లో భారీగా పేలుడు పదార్థాలు ఉండడాన్ని గుర్తించారు. వెంటనే వాటిని స్వాధీన పరుచుకొని పరిశీలించగా అందులో 1600ల జిలెటిన్ స్టిక్స్, 300ల డిటోనేటర్లు రెండు బెండల ఎక్స్‌టెన్షన్ అండ్ వైర్ ఉన్నట్లు గుర్తించారు.
వీటి విలువ సుమారు రూ.80 వేల రూపాయల వరకు ఉంటుందని అంచనా. వీటిని నల్గొండ జిల్లాలోని జనగామ మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన ప్రశాంత్, తిప్పర్తి మండలానికి చెందిన సుధాకర్ రావు వీటిని నిల్వ ఉంచారని బండరాళ్లు పగలగొట్టడానికి వీటిని ఉపయోగిస్తున్నట్లు వారు వెల్లడించినట్టు సీఐ తెలిపారు. జిలెటిన్ స్టిక్స్ డిటోనేటర్ల వాడకంపై నిషేధం ఉందని వీటిని ఉపయోగించాలంటే తప్పనిసరి ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని వీరి వద్ద ఎలాంటి అనుమతి పత్రాలు లేవని ఈ ఘటనపై లోతుగా సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు చేపడతామని పట్టణ సీఐ రమేష్ బాబు తెలిపారు. కాగా ఎన్నికల వేళ జడ్చర్ల పట్టణంలో భారీగా పేలుడు పదార్థాలు లభ్యమవడం సంచలనం రేపింది.