ఫండ్స్ కోసం కసరత్తు.. ఎమ్మెల్యే కావాలంటే రూ.100 కోట్లు!
‘‘ఓ కాంగ్రెస్ నేతకు ఏఐసీసీ నుంచి టిక్కెట్ కన్ఫమ్అయిందనే సంకేతాలు అందడంతో.. ఇప్పుడు ఆయన ఆర్థిక వనరులు సమకూర్చుకునే పనిలో పడ్డారు.
‘‘ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ కాంగ్రెస్ నేతకు ఏఐసీసీ నుంచి టిక్కెట్ కన్ఫమ్అయిందనే సంకేతాలు అందడంతో.. ఇప్పుడు ఆయన ఆర్థిక వనరులు సమకూర్చుకునే పనిలో పడ్డారు. గతంతో పోల్చితే ఈ ఎన్నికల్లో మనీ ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనాకు వచ్చిన ఆయన.. సుమారు రూ.100 కోట్ల వరకు సిద్ధం చేసేందుకు రెడీ అవుతున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. టికెట్ వస్తే ఆయన జనరల్ సెగ్మెంట్ నుంచి బరిలో పోటీచేయనున్నారు. ఇప్పటికే అతనికి ఉన్న భూములను అమ్మకానికి పెట్టగా.. బ్యాంకుల నుంచి కూడా రుణాలు పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.’’
దిశ, తెలంగాణ బ్యూరో: మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ల ఫస్ట్ లిస్టు ప్రకటించింది. మిగితా పార్టీలు సైతం త్వరలో ప్రకటించనున్నాయి. అయితే.. ఇప్పటికే టికెట్ సాధించిన వారు, ఇతర పార్టీల్లో టికెట్ వస్తుందని ధీమాతో ఉన్న వారు ఇప్పుడు ఎన్నికల ఫండింగ్ వేటలో పడ్డారు. జనరల్ స్థానాల్లో రూ.100 కోట్ల వరకు ఖర్చు చేసేందుకు అంచనాలు రూపొందిస్తుండగా.. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో సెగ్మెంట్‌కు రూ.30 కోట్ల వరకు ఖర్చు పెట్టాల్సి వస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే కొందరు ఆస్తులు, భూములు అమ్మకాలకు పెట్టగా, మరికొందరు అనుచరుల పేరిట లోన్లు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇంకొందరు సేల్ డీడ్‌లతో ఇంటర్నల్ ఒప్పందాలు చేసుకుంటున్నారు.
బీఆర్ఎస్ ప్రభావంతోనే..
బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల వ్యయాన్ని అమాంతం పెంచేసిందని ప్రతిపక్ష పార్టీలు విరుచుకుపడుతున్నాయి. రెండు టర్మ్‌లు అధికారంలో ఉండడంతో.. ఎన్నికల్లో విచ్చలవిడిగా ఖర్చుపెట్టేందుకు సిద్ధమవుతోందని కాంగ్రెస్, బీజేపీలు భావిస్తున్నాయి. ఇప్పటికే దుబ్బాక, హుజూరాబాద్, నాగార్జునసాగర్, మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ చేసిన ఖర్చే ఇందుకు నిదర్శనంగా భావిస్తున్నారు. తమ పార్టీల నుంచి సపోర్టు లేకపోవడంతో గత్యంతరం లేక ఆస్తులు, భూములు అమ్మకాలతోపాటు లోన్లు కూడా పెట్టాల్సిన వస్తోందని ఓ నేత చెప్పుకొచ్చారు. కాగా.. ఇప్పటికే చట్టసభల్లో ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్లకు డబ్బు జమ కష్టం కాకపోయినా.. కొత్తగా పోటీ చేసే వారికి మాత్రం సవాల్‌గా తయారైంది.
డబ్బుంటే గెలుపు ఈజీ..
రెండు సార్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టేందుకు కసరత్తు చేస్తున్నది. ఇందులో భాగంగా ఊహించని విధంగా ఇప్పటికే 115 మందికి టిక్కెట్లు ప్రకటించింది. ఇందులో సుమారు 30 నుంచి 35 మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నట్లు కొన్ని రోజులుగా వివిధ సర్వేలు చెబుతున్నా.. కేసీఆర్ వాటిని ఖాతరు చేయకుండా వారికే టికెట్లు కేటాయించారు. అయితే.. డబ్బు ప్రభావం చూపితే వ్యతిరేకత ఉన్న అభ్యర్థులను కూడా గెలిపించుకోవచ్చే ధీమాతో బీఆర్ఎస్ ఆలోచిస్తునలో ఉన్నట్లు పొలిటికల్ సర్కిల్‌లో టాక్ నడుస్తోంది. అయితే భారీగా డబ్బులు ఖర్చు పెట్టి గెలిస్తే పదింతలు సంపాదించుకోవచ్చనే యోచనలో నేతలు ఉన్నారు.