Harish Rao : రుణమాఫీలో రైతులకు కొత్త సమస్యలు.. మాజీ మంత్రి హరీష్ రావు సంచలన ట్వీట్
రైతు రుణమాఫీ అంశంపై మాజీ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా సంచలన ట్వీట్ చేశారు.
దిశ, వెబ్‌డెస్క్ : రైతు రుణమాఫీ అంశంపై మాజీ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా సంచలన ట్వీట్ చేశారు. డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తామన్న మాట తప్పి, 7 నెలల తర్వాత ఆ ప్రక్రియను ప్రారంభించడం వల్ల రైతులకు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. ముందుగా ఏడు నెలల వడ్డీ చెల్లించాకే, రుణ మాఫీ చేస్తామని బ్యాంకర్లు వేధిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం చెప్పిన రుణమాఫీ దేవుడెరుగు, వడ్డీ చెల్లించేందుకు కొత్తగా అప్పులు చేయాల్సి వస్తుందని బాధపడుతున్నారని పేర్కొన్నారు.
ప్రభుత్వం తక్షణం స్పందించి, డిసెంబర్ నుంచి జూలై దాకా వడ్డీని తామే భరిస్తామనీ, రైతుల నుంచి వసూలు చేయవద్దని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం శివంపేట్ మండలానికి చెందిన ఒక రైతు క్రాప్ లోన్‌ను, రూ.9000 మిత్తి కట్టించుకున్నాకే క్లోజ్ చేశారని గుర్తు చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలానికి చెందిన రైతులకూ ఇదే పరిస్థితి ఎదురైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. నాకు రైతులు పంపిన విజ్ఞప్తులను మీ పరిశీలనకు పంపుతున్నాను అంటూ ట్వీట్‌కు ఫొటోలు జత చేశారు. వెంటనే సమస్య పరిష్కరించాలని కోరుతున్నా అని ట్వీట్‌ను TelanganaCMOకు హరీష్ రావు ట్యాగ్ చేశారు.