సాహితీ దారిలో ‘ఈవీకే’! బైబ్యాక్ పేరుతో జీఎస్ఆర్ ఇన్ఫ్రా దందా

అందమైన బ్రోచర్లను ముద్రించి.. పెట్టుబడిని రెండేండ్లలో రెట్టింపు చేస్తామని ఈవీకే-జీఎస్ఆర్ ఇన్ఫ్రా అనే కంపెనీ కస్టమర్లను ఆకర్షించింది.

Update: 2023-06-01 03:30 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: అందమైన బ్రోచర్లను ముద్రించి.. పెట్టుబడిని రెండేండ్లలో రెట్టింపు చేస్తామని ఈవీకే-జీఎస్ఆర్ ఇన్ఫ్రా అనే కంపెనీ కస్టమర్లను ఆకర్షించింది. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో 200 ఎకరాల్లో గేటెడ్ మెగా ప్రాజెక్టు, అబెండలో మరో 200 ఎకరాల్లో వెంచర్ అంటూ ఫామ్ ప్లాట్లను విక్రయించింది. బ్రోచర్ లో వెంచర్ గా చూపించి.. 200 గజాల స్థలాన్ని మాత్రం వ్యవసాయ భూమిగా రిజిస్ట్రేషన్ చేసింది.

ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొట్టింది. విశాలమైన రోడ్లను బ్రోచర్ లో చూపించినా.. తీరా హక్కులు కల్పించేటప్పుడు మాత్రం ఆ రోడ్లేవీ కస్టమర్ల సొంతం కాకుండా జాగ్రత్త పడ్డారు. అయితే బై బ్యాక్ పేరిట రూ. కోట్లు కూడబెట్టుకొని పెద్ద ఎత్తున ప్లాట్లను అమ్మేశారు. కానీ సంవత్సరాలు గడుస్తున్నా రిటర్న్స్ ఇవ్వకపోవడంతో కస్టమర్లు లబోదిబోమంటున్నారు.

రామచంద్రాపురం పీఎస్‌లో కేసు

ఈవీకేతోపాటు వివిధ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు ఏజెంట్ గా పని చేస్తున్న హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి ఈవీకే-జీఎస్ఆర్ ఇన్ ఫ్రాపై సైబరాబాద్ పరిధిలోని రామచంద్రాపూర్ పీఎస్ లో ఫిర్యాదు చేశాడు. ‘రూ.50 లక్షలు పెట్టుబడి పెడితే రెండేండ్లల్లోనే రూ.కోటి వస్తుందని ఆశ పెట్టారు. సెక్యూరిటీగా ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తామన్నారు. దీంతో ఓ ఎన్ఆర్ఐ చేత 2021 ఫిబ్రవరి 22న రూ.50 లక్షలు పెట్టుబడి పెట్టించాను. అయితే 2023 ఫిబ్రవరి 22 నాటికి రెండేండ్లవుతుంది. ఎన్ఆర్ఐ స్నేహితుడు ఈవీకే కంపెనీని సంప్రదించారు. కంపెనీ ఎండీ శ్రీనివాసరావు, మార్కెటింగ్ హెడ్ శిల్పలు స్పందించడం లేదు.

వాట్సాప్ మెస్సేజ్ లకు కూడా రిప్లయ్ ఇవ్వడం లేదు. కాల్స్ కూడా అటెండ్ చేయడం లేదు. చాలా రోజుల తర్వాత మూడు పోస్ట్ డేటెడ్ చెక్కులు అందజేశారు. ఒక దానిపై రూ.23.75 లక్షలు, మరో రెండింటిపై రూ.5 లక్షల వంతున రాశారు. మూడు నెలల తర్వాత డబ్బులు ఇస్తామన్నారు. పలు మార్లు రిక్వెస్ట్ చేసిన రూ.కోటి ఇస్తామన్నారు. ఆ తర్వాత మళ్లీ రెస్పాన్స్ కావడం లేదు.’ అని ఫిర్యాదులో పేర్కొన్నాడు.

కస్టమర్ కి న్యాయం చేయాలని కోరాడు. దీంతో ఈవీకే ఎండీ జీ శ్రీనివాసరావు, మార్కెటింగ్ హెడ్ శిల్ప లపై సెక్షన్ 292, 417, 420 ల కింద కేసు నమోదు చేశారు. జీ శ్రీనివాస్ రావు, ఈవీకే, జీఎస్ఆర్ ఇన్ఫ్రా తోపాటు ఇవాన్ ఫైన్ టెక్, అనూష ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, గుంటూరు గ్రీన్ పవర్ జనరేషన్, జీఎఫ్ఆర్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్ తదితర కంపెనీల్లోనూ ఎండీగా, డైరెక్టర్ గా పని చేస్తున్నారు.

నష్టపోయిన కస్టమర్లు, ఏజెంట్లు

క‌రోనా స‌మ‌యంలో పుట్టిన ఈవీకే అనే రియ‌ల్ ఎస్టేట్ కంపెనీలో కస్టమర్లతో ఏజెంట్లు కూడా తీవ్రంగా నష్టపోయినట్లు తెలుస్తున్నది. రూ.50 లక్షలు పెట్టుబడి పెడితే రెండేళ్లలో రెండింతలు చేసి రూ.కోటి ఇస్తామని, సెక్యూరిటీగా 200 గజాల స్థలం రిజిస్టర్ చేస్తామని కంపెనీ ఆఫర్ చేసింది. దీంతో ఏజెంట్లు తమకు తెలిసిన వారితో 2021లో రూ.50 లక్షల చొప్పున పెట్టుబడి పెట్టించారు. అయితే కంపెనీ 200 గజాల స్థలాన్ని రిజిస్టర్ చేసినా, బై బ్యాక్ ఆఫర్ కింద రూ.కోటి ఇవ్వకుండా దాటవేస్తున్నారు. దాంతో కస్టమర్లు ఏజెంట్లపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు.

కంపెనీకి వచ్చి ఆరా తీస్తే సరిగ్గా స్పందించడం లేదని ఏజెంట్లు వాపోతున్నారు. దీంతో ఒక ఏజెంట్ ‘ రూ. కోటి గురించి అడిగితే ఈవీకే ఎండీ జీ శ్రీనివాస్ రావు, మార్కెటింగ్ హెడ్ శ్రీనివాసరావులు స్పందించడం లేదు. పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చారు. కస్టమర్ పేరిట రిజిస్టర్ చేసిన 200 గజాల భూమిని తిరిగి కంపెనీకి బదలాయించాలని, ఆ ప్రక్రియ పూర్తయిన మూడు నెలల తర్వాత సొమ్ము ఇస్తామనే స‌మాచారం చెప్పారు. ఆ తర్వాత సంప్రదించడానికి ఎన్నిసార్లు ప్రయత్నించినా స్పందించడం లేదు.’ అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

50 శాతం లాభం మీకే..

గేటెడ్ మెగా ప్రాజెక్ట్ పేరిట నారాయణఖేడ్ లో 200 ఎకరాల్లో చేస్తున్నామని జీఎస్ఆర్ ఇన్ఫ్రా గ్రూప్ ప్రైవేటు లిమిటెడ్ అనే కంపెనీ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ‘605 గజాలకు కేవలం రూ.6 లక్షలే. 39 స్యాండల్ వుడ్, 38 టీక్ ప్లాంట్స్ ఇస్తాం. 12 ఏండ్లల్లో రూ.80 లక్షలు మీ సొంతం. అంతా మేమే చూసుకుంటాం. ఆ 12 ఏండ్ల పాటు మేమే మెయింటెయిన్ చేస్తాం. ఐదు గుంటలు కొంటే 5 గ్రాముల బంగారమిస్తాం. 10 గుంటలు కొంటే 12 గ్రాముల బంగారమిస్తాం. ఈ ఆఫర్ అక్టోబరు 25 వరకే.’ అంటూ జీఎస్ఆర్ ఇన్ఫ్రా మోడరన్ ఫామ్స్ 1, 2 పేరిట పబ్లిసిటీ చేస్తున్నారు.

‘రైతుబంధు ఇస్తాం. భవిష్యత్తు కోసం ఇన్సూరెన్స్ కూడా వస్తుంది.’ అని చెబుతున్నారు. కస్టమర్లకు అంటగట్టిన స్థలాలకు సంబంధించిన సేల్ డీడ్స్ చెక్ చేయగా మరికొన్ని వింతలు బయటపడ్డాయి. లే అవుట్ లో పేర్కొన్న రోడ్లను సేల్ డీడ్ లో చూపించలేదు. ఉదాహరణకు సంగారెడ్డి జిల్లా నాగల్ గిద్ద మండలం మోర్గి రెవెన్యూ పరిధిలో సర్వే నం.15లో 5 గుంటలను విక్రయించారు. పాసు పుస్తకం కూడా వచ్చింది. షెడ్యూల్ ఆఫ్ ప్రాపర్టీలో నార్త్ , సౌత్, ఈస్ట్, వెస్ట్ .. నాలుగువైపులా కంపెనీ ఎండీ గుంటుపల్లి శ్రీనివాస రావు భూమి ఉంది.

మధ్యలో ఈ ఐదు గుంటలు ఉందన్న మాట! అలాగే మునిపల్లి మండలం మేలసింగారంలో ఇదే జీఎస్ఆర్ ఇన్ఫ్రా గ్రూప్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ నుంచి ఒకాయన సర్వే నం.16లో ఎకరం స్థలం కొనుగోలు చేశారు. జూన్ 28న రిజిస్ట్రేషన్ అయ్యింది. దీనికి రూ.3,37,365 చెల్లించినట్లు సేల్ డీడ్ లో పేర్కొన్నారు. అలాగే సరిహద్దుల్లో నలువైపులా గుంటుపల్లి శ్రీనివాసరావు భూమి ఉన్నట్లు పేర్కొన్నారు.

ఆయనకు కూడా ఎలాంటి రోడ్డు చూపించలేదు. మరొకాయన 20 గుంటలు ఏప్రిల్ లో కొనుగోలు చేశారు. ఆయనకు రూ.1,68,683 మాత్రమే తీసుకున్నారట! ఆయనకు కూడా రోడ్డు మార్గం లేదు. నలుదిక్కులా ఇతరులే ఉన్నారు. వీళ్లంతా భవిష్యత్తులో ఏ విధంగా వారి ఫామ్ ల్యాండ్ కు చేరుకుంటారో వేచి చూడాలి. ఇప్పుడేమో ఎలాంటి రిటర్న్స్ లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.

Tags:    

Similar News