రీ డెప్లాయ్‌‌మెంట్‌కు సర్వం సిద్ధం.. ‘రెవెన్యూ’లోకి వచ్చేందుకు 9,654 మంది రెడీ

రెవెన్యూ శాఖలో తిరిగి రావడానికి 9,654 మంది పూర్వపు వీఆర్వో, వీఆర్ఏలు సంసిద్ధత వ్యక్తం చేశారు.

Update: 2024-12-31 02:16 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రెవెన్యూ శాఖలో తిరిగి రావడానికి 9,654 మంది పూర్వపు వీఆర్వో, వీఆర్ఏలు సంసిద్ధత వ్యక్తం చేశారు. గూగుల్ ఫారాల ద్వారా ఆప్షన్ ఇచ్చారు. వారి వివరాలను పరిశీలించే బాధ్యతను ప్రభుత్వం ఆయా జిల్లా కలెక్టర్లకు అప్పగించిచగా, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు గూగుల్ ఫారాలను పరిశీలించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. కొందరు విద్యార్హత డాక్యుమెంట్లు అప్ లోడ్ చేయకపోవడంతో వారిని డైరెక్టుగా ఆఫీసులకు పిలిపించుకుంటున్నట్లు తెలిసింది. కొన్ని జిల్లాల్లోనైతే స్టడీ సర్టిఫికెట్లు, ఆర్డర్ కాపీలు తీసుకొని కలెక్టరేట్ కి రావాలంటూ మెస్సేజులు పంపారు. రాష్ట్రవ్యాప్తంగా పూర్వపు వీఆర్వోలు మొత్తం 5,130 మంది ఉండగా 3,534 మంది, వీఆర్ఏలు 16 వేల మందికి పైగా ఉండగా 5,987 మంది మాత్రమే ఆప్షన్ ఇచ్చారు.

వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థలు రద్దు చేసిన తర్వాత రీ డెప్లాయ్మెంట్ ద్వారా ఇతర డిపార్టుమెంట్లల్లో వివిధ హోదాల్లో బదిలీ చేశారు. వీఆర్ఏల్లో కొందరిని తహశీల్దార్ ఆఫీసుల్లోనే జూనియర్ అసిస్టెంట్లుగా బాధ్యతలు అప్పజెప్పారు. ఇలా కొన్ని మండలాల్లో ఇద్దరు, ముగ్గురు చొప్పున ఉన్నారు. నిజానికి అక్కడ అన్ని పోస్టులు లేవు. ఇలాగే కొనసాగించడం ద్వారా భవిష్యత్తులో తలెత్తే సర్వీస్ మ్యాటర్స్ అంశం వివాదంగానూ మారే అవకాశాలు ఉన్నాయి. అలా జూనియర్ అసిస్టెంట్లుగా పని చేస్తున్న పూర్వపు వీఆర్ఏల్లో చాలా మంది ఆప్షన్ ఇవ్వలేదని సమాచారం. అలాగే వీఆర్వోలు కొందరు ఇతర శాఖల్లో సర్దుకుపోదాం.. రెవెన్యూలోకి వెళ్లి మళ్లీ ఇబ్బందులు ఎదుర్కోవడం ఎందుకన్న అభిప్రాయంతో ఉన్నారు. ఇంకొందరేమో రిటైర్మెంట్ కి దగ్గర ఉన్న తాము ఇప్పుడు శాఖ మారడం వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయోనన్న అనుమానంతో ఉన్నారు. అయితే నియామకపు ప్రక్రియలో క్లారిటీ వస్తుందని అధికారులు చెప్తున్నారు.

ఆప్షన్లు ఇచ్చిన వారు : 9,654

వీఆర్వో కేటగిరి : 3,534

డిగ్రీ– 1,516

ఇంటర్– 1,347

ఇతరులు– 614

వీఆర్ఏ కేటగిరి: 5,987

డిగ్రీ– 1,926

ఇంటర్– 1,280

ఇతరులు– 2,781

వీఆర్వో/వీఆర్ఏ కేటగిరి: 133

డిగ్రీ– 56

ఇంటర్– 37

ఇతరులు– 40

Tags:    

Similar News