ప్రతీ కుటుంబానికి పని కల్పించాల్సిందే: మంత్రి సీతక్క

పేదల ఆర్థిక అవసరాలకు, జీవన ప్రమాణాలను దృష్టిలో పెట్టుకుని మన్‌మోహన్ సింగ్ హయాంలో యూపీఏ ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చిందని

Update: 2024-06-10 17:04 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: పేదల ఆర్థిక అవసరాలకు, జీవన ప్రమాణాలను దృష్టిలో పెట్టుకుని మన్‌మోహన్ సింగ్ హయాంలో యూపీఏ ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చిందని, కానీ ఇటీవలి కాలంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దాన్ని నీరుగారుస్తున్నదని, బడ్జెట్‌ కేటాయింపుల్లో కోతపెడుతున్నదని రాష్ట్ర మంత్రి సీతక్క ఆరోపించారు. సంవత్సరానికి 100 రోజులుగా ఉన్న పని దినాలను ఇకపైన 150 రోజులకు పెంచేలా, రోజు కూలీని రూ. 400కు పెంచేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామన్నారు. ‘గ్రామీణ ఉపాధి హామీ చట్టం – సవాళ్లు’ అనే అంశంపై తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సోమవారం నిర్వహించిన సదస్సుకు హాజరైన మంత్రి పై వ్యాఖ్యలు చేశారు. పేదల కడుపు నింపడానికి ఉద్దేశించిన ఈ పథకం పక్కాగా అమలయ్యేందుకు పార్లమెంటు వేదికగా కాంగ్రెస్ పోరాడుతుందన్నారు.

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగానే ఉపాధి హామీ పనిదినాలను, కూలీని పెంచడంపై కాంగ్రెస్ స్పష్టమైన హామీ ఇచ్చిందని, దాన్ని ఆమల్లోకి తెచ్చేలా, చిత్తశుద్ధితో కేంద్రంపై కొట్లాడుతుందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. మన్‌మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు గ్రామీణ పేదరికాన్ని దృష్టిలో పెట్టుకుని వామపక్షాలు లేవనెత్తిన అంశానికి అనుగుణంగా గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉనికిలోకి వచ్చిందని ఆమె గుర్తుచేశారు. కానీ దురదృష్టవశాత్తు బీజేపీ ప్రభుత్వం ఆ స్కీమ్‌ను ఉద్దేశపూర్వకంగా నీరుగార్చే విధానాలను అవలంబిస్తున్నదని, భవిష్యత్తులో ఎత్తివేయాలనే కుట్ర చేస్తున్నదని ఆమె ఆరోపించారు. పెరిగిన ధరల కనుగుణంగా దేశవ్యాప్తంగా గ్రామీణ ఉపాధి హామీ కూలీల వేతనాన్ని పెంచాలని, చట్ట ప్రకారం ప్రతీ వారం వారికి పేమెంట్ జరగాలని రాజ్యసభ సభ్యుడు శివదాసన్ ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ స్కీమ్ కింద పని ఇవ్వలేనిపక్షంలో వారికి నిరుద్యోగ భృతి పేరుతో పరిహారం చెల్లించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గ్రామీణ ఉపాధి హామీ రోజు కూలీ రూ. 300 ఏ రాష్ట్రంలోనూ సక్రమంగా అమలు కావడం లేదన్నారు. పని చేసే టైమ్‌లో ప్రమాదం జరిగితే ఉచిత వైద్యం అందించాలని చట్టంలో పేర్కొన్నా అమలు అటకెక్కిందని ఆరోపించారు. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నట్లు కేంద్ర ప్రభుత్వమే వేర్వేరు సందర్భాల్లో వ్యాఖ్యానిస్తున్నా ఉపాధి హామీ కూలిని మాత్రం పెంచడంలేదన్నారు. ధరలను నియంత్రించడంలో విఫలమైన కేంద్ర ప్రభుత్వం చివరకు ఉపాధి హామీ పథకాన్ని కూడా పకడ్బందీగా అమలు చేయడంలో ఫెయిల్ అయిందన్నారు. ఈ చట్టాన్ని స్ఫూర్తివంతంగా అమలు చేయడానికి దేశవ్యాప్త ఉద్యమాన్ని చేపడతామని రైతుసంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ స్పష్టం చేశారు.

ఉపాధి పనిలో యంత్రాలను నిషేధించాలన్న నిబంధన ఉన్నప్పటికీ దానికి విరుద్ధంగా మెటీరియల్ కాంపోనెంట్ నిధులను 49 శాతానికి పెంచి కాంట్రాక్టర్లకు ఉపాధి హామీ పనులను నిధులను కేంద్ర ప్రభుత్వం డైవర్ట్ చేస్తున్నదని ఆరోపించారు. పరోక్షంగా కూలీలే ఉపాధి పనికి దూరమయ్యేలా కేంద్రం పొమ్మనలేక పొగబెట్టిన తీరులో వ్యవహరిస్తున్నదన్నారు. సరికొత్త నిబంధనలు తీసుకొచ్చి ఇబ్బందులు సృష్టిస్తున్నదన్నారు. పని ప్రదేశంలో రోజుకు రెండుసార్లు ఫోటోలు తీసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడం, బ్యాంక్ అకౌంట్లలో వేతనాన్ని జమ చేయడం, ఆధార్ కార్డుతో బ్యాంక్ అకౌంట్ ఉపాధి జాబ్ కార్డును అనుసంధానం చేయడం... ఇవన్నీ పనిచేసే కూలీల సంఖ్యను కుదించే ప్రయత్నమేనని ఆరోపించారు.


Similar News