ప్రభుత్వ భూములని తేల్చినా.. ఆగని ఆక్రమణలు

‘రాజ ద్రోహం కేసులో మరణ శిక్ష పడిన ఓ ఖైదీ.. రాజును ప్రాధేయ పడాల్సింది పోయి ముసిముసిగా నవ్వుతాడు...అశ్చర్య పోయిన రాజు ఎందుకు నవ్వుతున్నావని గద్దించగా... ఓ రాజా మీరు నన్ను ఉరితీస్తే ‘ఎగిరే గుర్రం’ గురించి మీరు తెలుసుకోలేరు కదా..!

Update: 2023-05-07 10:42 GMT

దిశ ప్రతినిధి, మేడ్చల్: ‘రాజ ద్రోహం కేసులో మరణ శిక్ష పడిన ఓ ఖైదీ.. రాజును ప్రాధేయ పడాల్సింది పోయి ముసిముసిగా నవ్వుతాడు...అశ్చర్య పోయిన రాజు ఎందుకు నవ్వుతున్నావని గద్దించగా... ఓ రాజా మీరు నన్ను ఉరితీస్తే ‘ఎగిరే గుర్రం’ గురించి మీరు తెలుసుకోలేరు కదా..! ఆ రహస్యం నాతోనే అంతం అవుతుందని అంటాడు. రాజు మరింత ఆసక్తిగా అడగ్గా... నేటి నుంచి మరో ఆరు నెలల్లో ఆ మహాద్భుతం ఆవిష్కృతమవుతుంది అంటాడు. దీంతో రాజు ఆ ఖైదీ మరణశిక్షను మరో ఆరు నెలలు వాయిదా వేస్తాడు.

రాజ్యం మొత్తం చర్చనీయాంశంగా మారిన ఎగిరే గుర్రం నిజమేనా..? అని తోటి ఖైదీ అడగ్గా అసలు విషయం చెబుతాడు కానీ.. నేను చెప్పిన అబద్దం వల్ల మరణ శిక్ష ఆరు నెలలు వాయిదా పడింది.. ఈ లోపు రాజు చనిపోవచ్చు... రాజ్యం దురాక్రమణకు గురి కావచ్చు... భూ కంపం వంటివి సంబంధించి మనం పారిపోయే అవకాశం రావచ్చు. రాజు మనసు మారీ ఖైదీలను విడుదల చేయొచ్చు... శిక్షలు తగ్గించవచ్చు... ఇవన్నీ కాకపోయినా ఏమో గుర్రం ఎగరా వచ్చమో అంటూ సెలవిస్తాడు..

మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలో అక్రమార్కులు సరిగ్గా ఇదే సూత్రాన్ని పాటిస్తున్నారు. తమకు సహకరించే అధికారుల అండతో తమ అక్రమాలను యధేచ్చగా కొనసాగిస్తున్నారు. శామీర్ పేట మండల పరిధిలోని దేవరయాంజాల్ భూములలో అక్రమ నిర్మాణాలు యధేచ్చగా జరుగుతున్నాయి. కాగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ బర్తరఫ్ తో వెలుగు చూసిన దేవరయాంజాల్ లోని శ్రీ రామచంద్ర స్వామి ఆలయ భూములు దేవాదాయ శాఖ భూములపై 2021,మే 2వ తేదీన కమిటీ వేసింది.

సీనియర్ ఐఏఎస్ అధికారి రఘునందన్ రావు నేతృత్వంలో ఐఏఎస్ లు ప్రశాంత్ జీవన్, భారత్ హోలికేలీ, శ్వేతామహంతిలతో ఉన్నతస్ధాయి కమిటీని వేసింది. ఈ కమిటీ దేరయాంజాల్ లో క్షేత్రస్థాయిలో పర్యటించి ఆలయ భూముల్లో వాణిజ్య నిర్మాణాలు, ఫంక్షన్ హాళ్లు, రిసార్టులు, పరిశ్రమలు పుట్టుకొచ్చినట్లు గుర్తించింది. అలాగే కొంతమంది సాగు కూడా చేసుకుంటున్నట్లు గుర్తించింది. ఈ నేపథ్యంలో ఆలయానికి సంబంధించి 1,350 ఎకరాలు దేవాదాయ శాఖకే చెందుతున్నాయని 2022, నవంబర్ 15వ తేదీన సర్కారుకు ఇచ్చిన నివేదికలో విచారణ కమిటీ నిగ్గు తేల్చింది.

కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలు..

ప్రభుత్వం నలుగురు ఐఏఎస్ అధికారులతో సమగ్ర విచారణ చేసి, భూములు అలయానికి సంబంధించినవే అని తేల్చినా... అక్రమార్కులు మాత్రం ఎక్కడ తగ్గడం లేదు. ఇప్పటికి ఆలయ భూములలో అక్రమ నిర్మాణాలను కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా ఓ బీఆర్ఎస్ ముఖ్య నేత, మంత్రి సమీప బంధువు దేవాదాయ స్థలంలోని సర్వే నెంబర్ 657 లో ఎలాంటి అనుమతులు లేకుండా ఫంక్షన్ హాల్ నిర్మించడం చర్చనీయాంశంగా మారింది. అదేవిదంగా కొందరు అధికార పార్టీ నేతలు చెరువులను పూడ్చి భారీ షెడ్లను నిర్మిస్తున్నారు.

ఇంతా అక్రమాలు జరుగుతున్నా.. అటు రెవెన్యూ, మున్సిపాలిటీ, ఇటు దేవదాయ అధికారులు స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. గతంలో జరిగిన పొరపాట్ల సంగతి అలా ఉంచితే ఇప్పటికే దేవాదాయ భూముల్లో కొనసాగుతున్న అక్రమాలపై సైతం చర్యలు తీసుకోకపోవడం వెనుక మతలబేంటో జిల్లా రెవెన్యూ, మున్సిపల్ అధికారులే తేల్చాలి. సామాన్యులపై మాత్రం తమ ప్రతాపం చూపుతూ అక్రమార్కులకు అధికారులు కొమ్ము కాస్తూ ఉండటం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ముందు హడావిడి.. ఆ తర్వాత షరా మామూలే..

అడపాదడపా కొత్తగా వచ్చే కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, కమిషనర్లు కొన్ని రోజులు హల్ చల్ చేయడం ఆ తర్వాత గప్ చుప్ అయిపోవడం పారిపాటిగా మారింది. అధికారులు అవినీతి కారణంగా అక్రమార్కులు చెలరేగిపోతున్నారనే నిర్విదాంశం. ఆలయ భూములకు సంబంధించి ఎకరాల కొద్దీ కబ్జాకు గురవుతున్నాయి. పెద్ద పెద్ద షెడ్లు, ఫంక్షన్ హాళ్లు, వాణిజ్య భవనాలు నిర్మిస్తూ.. రూ. కోట్ల విలువైన దేవాలయ భూములను కొల్లగొడుతున్నారు.

అక్రమార్కులు విలువైన భూములను కబ్జా చేసి, వాటిల్లో నిర్మాణాలు చేపడుతుంటే అడ్డుకొని యంత్రాంగం.. ఆ తర్వాత జీవో 59 ద్వారా సదరు నిర్మాణాలను రెగ్యులరైజ్ చేసేందుకు సహకరిస్తుందనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు దేవాదాయ స్థలాల్లో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటారా..? లేదా క్రమబద్దీకరణకు సహకరిస్తారా..? రాజ ద్రోహం కేసులో శిక్ష పడిన ఖైదీలా.. అక్రమార్కుల గారడీలతో బోల్తా పడి ..అక్రమార్కులకు అవకాకాల మీద అవకాశాలు ఇస్తూ పోతారో.. వేచి చూడాల్సిందే మరీ....

Tags:    

Similar News