ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు ఆలస్యం..! నేడో, రేపో వెబ్ అప్షన్ ఫలితాలు విడుదల
మొదటి విడత ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది.
దిశ, వెబ్‌డెస్క్: మొదటి విడత ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇవాళ అర్ధరాత్రి దాటాక గానీ, లేని పక్షంలో శనివారం మధ్యాహ్నం వెబ్ ఆప్షన్స్ రిజల్ట్స్‌ను వెల్లడించనున్నారు. కాగా, విద్యార్థులు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేందుకు గడువు పొడిగించడంతో సీట్లు కేటాయింపు ఆలస్యం అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నెల 16న సాయంత్రానికి 95,383 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లను పెట్టుకున్నారు. దాదాపు 96 వేల మంది వెబ్ అప్షన్లు పెట్టినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. అందులో కన్వీనర్ కోటాలో 72,741 బీటెక్ సీట్లు అందుబాటులో ఉంటాయి. అక్కడ సీఎస్‌ఈ, సంబంధిత సీట్లు 49,786 ఉన్నాయి.
కాగా, రాష్ట్రంలో ఈఏపీసెట్ తొలి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ జులై 4న ప్రారంభమైంది. అయితే, జూలై 12 వరకు విద్యార్థులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి సర్టిఫికేట్ల పరిశీలనకు స్లాట్ బుక్ చేసుకున్నారు. ఈ నెల 6 నుంచి 13 వరకు 36 హెల్ప్‌లైన్ కేంద్రాల్లో ఏదో ఒకచోట ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకున్న వారు ఈనెల 8 నుంచి 15 వరకు వారికి నచ్చిన కాలేజీలు, కోర్సులను ఎంచుకునేందుకు వెబ్‌ఆప్షన్లు ఇచ్చుకున్నారు. వారికి ఇవాళ రాత్రి గానీ, రేపు మధ్యాహ్నం తొలి విడతలో భాగంగా సీట్లు కేటాయిస్తారు. మరిన్ని వివరాలకు విద్యార్థులు http://tseapcet.nic.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని అధికారులు తెలిపారు.