ప్రభుత్వ స్థలాలే టార్గెట్.. యథేచ్ఛగా పాగా వేస్తున్న కబ్జారాయుళ్లు!

శేరిలింగంపల్లి మండలంలో సర్కార్ స్థలాల అన్యాక్రాంతం కొనసాగుతూనే ఉంది.

Update: 2024-03-03 03:54 GMT

దిశ, శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి మండలంలో సర్కార్ స్థలాల అన్యాక్రాంతం కొనసాగుతూనే ఉంది. ఇక్కడ అక్కడ అనే తేడాలేకుండా ఎక్కడ పడితే అక్కడ కోట్లాది రూపాయల సర్కార్ స్థలాలు, అసైన్డ్ ల్యాండ్స్ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో చేరుతున్నాయి. పక్కాగా సర్కార్ స్థలాలని తెలిస్తే చాలు యథేచ్ఛగా అందులో పాగా వేస్తున్నారు కొందరు కబ్జారాయుళ్లు. చెరువు శిఖాలు, పోరంబోకు భూములు, ఏళ్ల తరబడి ఎలాంటి కంచెలు లేని జాగాలపై కబ్జాకోరులు గద్దల్లా వాలిపోతున్నారు. ఇందుకు ఈ డివిజన్ ఆ డివిజన్ అనే తేడా ఏమీలేదు. ఇలాంటి వారికి కొందరు అధికారులు సపోర్ట్ చేస్తుండడంతో ఈ కబ్జాల పరంపర ఎంచక్కా సాగిపోతుందన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. రెవెన్యూ అధికారులు అలాంటి వారివైపు కనీసం కన్నెత్తి కూడా చూడడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. శేరిలింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా చాలా డివిజన్లలో కబ్జాల పర్వం సాగుతూనే ఉంది. గత కొన్నాళ్లుగా మాదాపూర్ డివిజన్ లోని ఖానామెట్ లో ప్రభుత్వ భూములను కబ్జాలకు పాల్పడుతున్నారు కొందరు వ్యక్తులు. దీనిపై సీపీఎం పార్టీ నాయకులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసిన గత నాలుగు నెలలుగా కనీసం చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.


ప్రభుత్వ స్థలాలే పక్కా టార్గెట్

శేరిలింగంపల్లి మండల పరిధిలో చందానగర్, దర్గా హుస్సేన్ షావన్, గచ్చిబౌలి, గఫుర్ నగర్, గోపన్ పల్లి, గుట్టల బేగంపేట్, హఫీజ్ పేట్, ఇజ్జత్ నగర్, కంచ గచ్చిబౌలి, ఖాజాగూడ, ఖానామేట్, కొండాపూర్, కొత్తగూడ, మదీనాగూడ, మాదాపూర్, మక్తా మహబూబ్ పేట్, మియాపూర్, నలగండ్ల, నానక్ రాంగూడ, రాయదుర్గ్ ఖల్సా, రాయదుర్గ్ నౌ ఖల్సా, రాయదుర్గ్ పాయగా, రాయదుర్గ్ పాన్ మక్తా, రామన్నగూడ, శేరిలింగంపల్లి, శేరి నలగండ్ల, తారానగర్ రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అలాగే శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని కూకట్ పల్లి మండల పరిధిలోకి వచ్చే బాగ్ అమీర్, హైదర్ నగర్, శంశీగూడ రెవెన్యూ గ్రామాల పరిధిలో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి. వీటిలో కొన్ని కోర్టు కేసుల్లో ఉండగా మరికొన్నింటిని ఆయా అవసరాల కోసం ప్రభుత్వం వినియోగిస్తుంది. ఇక మిగతా భూముల్లో కొందరు అక్రమార్కులు పాగా వేసి వాటిని తమ సొంతం చేసుకునే పనిలో తలమునకలుగా ఉన్నారు. అక్రమార్కులు ప్రభుత్వ భూములను చెరబట్టి దర్జాగా నిర్మాణాలు సాగిస్తున్నారు. అందుకు కొందరు ప్రభుత్వ అధికారులు కూడా హితోధికంగా సహాయ సహకారాలు అందిస్తుండడంతో కబ్జారాయుళ్ల ఆగడాలకు అడ్డు లేకుండా పోయింది.

ఖానామెట్ లో ప్రభుత్వ భూముల కబ్జాలు..

మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఖానామెట్ సర్వే నెంబర్ 41/14లో తాజా ధరణి రికార్డు ప్రకారం 180 ఎకరాల 13 గుంటల ప్రభుత్వ భూమి ఉన్నట్లు రికార్డుల్లో పేర్కొన్నారు. అందులో కొంత స్థలాన్ని అప్పట్లో వేలం వేయగా మరికొంత స్థలాన్ని ఆయా కుల సంఘాలకు, అలాగే పలు సంస్థలకు కూడా కేటాయించింది గత బీఆర్ ఎస్ ప్రభుత్వం. ఇలా పోయిన స్థలం కాకుండా అక్కడ ఇంకా ప్రభుత్వ స్థలం ఉంది. ఈ భూమిలోనే కొందరు కబ్జారాయుళ్లు నిర్మాణాలు చేపట్టగా, మరికొందరు సర్కార్ స్థలంలో కంచెలు వేసి రూములు నిర్మిస్తున్నారు. వాటిని అందినకాడికి అమ్ముకుంటున్నారు. అంతేకాదు వీరు ఈ స్థలాలపై హక్కుల కోసం గత బీఆర్ ఎస్ ప్రభుత్వం తెరమీదకు తీసుకువచ్చిన 58, 59 జీవోలను కూడా దుర్వినియోగం చేస్తూ రెగ్యులరైజ్ కోసం దరఖాస్తులు చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇలాంటి అక్రమార్కులకు రెవెన్యూలోని సిబ్బంది వంతపాడుతూ వాటిని రెగ్యులరైజ్ చేసేందుకు శాయశక్తులా ప్రయత్నాలు చేసినట్లు సమాచారం.

దిలీప్ చౌదరిపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు

ఖానామెట్ సర్వే నెంబర్ 41/14లో దిలీప్ చౌదరి అనే వ్యక్తి రెండుచోట్ల కోట్లాది రూపాయల విలువ చేసే ఎకరం స్థలం కబ్జా చేశారని, కంచెవేసి రూములు కట్టారని పేర్కొంటూ అందుకు సంబంధించిన ఫోటోలను ఇతర వివరాలను జతచేస్తూ 21 డిసెంబర్ 2023న సీపీఎం శేరిలింగంపల్లి జోనల్ కమిటీ రాజేంద్రనగర్ ఆర్డీఓకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు ఖానామెట్ భూములను కబ్జాలు చేసి అమ్మేసి సొమ్ముచేసుకుని రాజమండ్రి, గుంటూరు ప్రాంతాల్లో వ్యాపారాలు చేస్తున్నారని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయినా తమ ఫిర్యాదుపై రెవెన్యూ యంత్రాంగం నేటికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని, దిలీప్ చౌదరి వెనక రెవెన్యూ అధికారులు ఉన్నారని, వారి జేబులు నింపుకుని ఆవైపు కన్నెత్తి చూడడం లేదని సీపీఎం నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం మారినా రెవెన్యూ అధికారుల తీరుమారడం లేదని, శేరిలింగంపల్లి మండలంలోని కొందరు రెవెన్యూ సిబ్బంది నిర్వాకం, నిర్లక్ష్యం కారణంగానే దిలీప్ చౌదరి లాంటి చాలామంది ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తూ కోట్లు గడిస్తున్నారంటూ సీపీఎం నాయకులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా స్పందించక పోతే ఖానామెట్ భూములపై పోరాటాలకు దిగుతామని సీపీఎం నాయకులు హెచ్చరించారు.

Tags:    

Similar News