బీఆర్ఎస్‌లో ఎలక్షన్ మూడ్.. హ్యాట్రిక్ కొట్టేలా భారీ ప్లాన్!

బీఆర్ఎస్ ఎన్నికల మూడ్ లోకి వెళ్లింది. మరోసారి అధికారం దక్కించుకునేందుకు ప్లాన్ వేసింది. అందుకు ఇప్పట్నించే పావులు కదుపుతుంది.

Update: 2023-03-14 02:47 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ ఎన్నికల మూడ్ లోకి వెళ్లింది. మరోసారి అధికారం దక్కించుకునేందుకు ప్లాన్ వేసింది. అందుకు ఇప్పట్నించే పావులు కదుపుతుంది. ముందుగా గులాబీ కేడర్ లో జోష్ నింపేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఇందుకు అట్టహాసంగా ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించనుంది. దీనికి క్యాలండర్ కూడా ప్రిపేర్ చేసుకుంది. ఇక ప్రత్యేక ఇన్ చార్జిలను సైతం నియమించింది. వారి పర్యవేక్షణలోనే ప్రోగ్రామ్స్ చేపట్టనుంది.

కేసీఆర్ మార్క్ స్టార్ట్

అసెంబ్లీ ఎన్నికలకు 6 నెలలకుపైగా సమయం ఉంది. సీఎం కేసీఆర్ తన మార్క్ ను ఎన్నికల్లో అమలు చేసేందుకు రెడీ అయ్యారు. ముందుగా నిరాశ, నిస్పృహలో ఉన్న పార్టీ శ్రేణులను యాక్టివ్ చేసేందుకు ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణ బాధ్యతను ఎమ్మెల్యేలకు అప్పగించారు. ప్రతి ఎమ్మెల్యే తన సెగ్మెంట్ లోని కార్యకర్తలను ప్రోగ్సామ్స్ లో భాగంగా నేరుగా కలవడం, సమస్యలను వినడం, వెంటనే పరిష్కరించడం చేయాలని అధినేత ఆదేశించినట్టు.. ఇందుకు జిల్లాల ఇన్ చార్జిల నుంచి ఫీడ్ బ్యాక్ తెలుసుకుని, ఎదురయ్యే లోటు పాట్లును సవరించే పనిలో కేసీఆర్ నిమగ్నమైనట్టు సమాచారం.

విపక్షాల కంటే ముందుండేలా..

ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలంటే విపక్షాల కంటే ముందే ప్రచారం చేపట్టాలని కేసీఆర్ యోచించారు. అందుకే ముందుగా ఆత్మీయ సమ్మేళనాలు తెరపైకి తెచ్చారు. ఆ తర్వాత వరంగల్ లో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేశారు. దాని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా కేడర్ ను ఒకే చోటకు చేర్చడం, పార్టీలో జోష్ నింపాలని నిర్ణయించారు. మరోవైపు ప్రభుత్వ పథకాలైన దళిత బంధు, గొర్ల పంపిణీ, సొంతింటి జాగా లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ ప్రోగ్రామ్స్ అమలుకు కూడా కార్యాచరణ రెడీ చేశారు. ఇలా వరుస కార్యక్రమాలతో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా లీడర్లు, క్యాడర్ ను యాక్టివ్ గా ఉంచుతూ ఎన్నికల కదనరంగంలోకి దింపాలని డిసైడ్ అయ్యారు.

మునుగోడు ఫార్ములా ప్రిపేర్

మునుగోడు బై ఎలక్షన్ లో స్థానికంగా పట్టున్న రాజగోపాల్ రెడ్డిని ఆత్మీయ సమ్మేళనాలతోనే ఓడించామనే అభిప్రాయంలో బీఆర్ఎస్ లీడర్లు ఉన్నారు. పార్టీ అభ్యర్థి గెలుపు కోసం సీరియస్ గా పనిచేసే గ్రామస్థాయి లీడర్లను గుర్తించడంతోనే అది సాధ్యమైంది. అదే ఫార్ములాను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు కేసీఆర్ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. అయితే.. ఆత్మీయ సమ్మేళనాల తర్వాత బూత్ కు ఇద్దరు.. ముగ్గురు కార్యకర్తలను గుర్తించడం, ఎన్నికల పూర్తయ్యే వరకు నిత్యం వారితో టచ్ లో ఉండేవిధంగా ఫార్ములా రెడీ చేస్తున్నారు. అయితే.. బూత్ ఇన్ చార్జులకు కావాల్సిన నిధులను నేరుగా పార్టీ ద్వారా పంపే ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టు తెలిసింది.

పండుగలకు ఫండింగ్

ఇప్పట్నించే గ్రామాల్లోని ప్రజలకు దగ్గరయ్యేందుకు బీఆర్ఎస్ ఆలోచన చేస్తున్నది. ఓ వైపు కార్యకర్తలను అట్రాక్ట్ చేసేందుకు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూనే, మరోవైపు గ్రామాల్లో జరిగే పండుగలకు పార్టీ నుంచి ఫండింగ్ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తున్నది. సమ్మర్ లో గ్రామాల్లో జరిగే గ్రామ, కులదేవతల పండుగలకు ఎమ్మెల్యేలు నేరుగా అటెండ్ కావడం, పెద్దఎత్తున ఫండింగ్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

మందు.. విందులకు కసరత్తు

అసెంబ్లీ సెగ్మెంట్లలో నిర్వహించే ఆత్మీయ సమ్మేళనాలను భారీస్థాయిలో చేపట్టేలా బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నది. ఏడు నుంచి పది గ్రామాల కార్యకర్తలను కలుపుకుని నిర్వహించే సదస్సులకు పెద్దఎత్తున డబ్బులను ఖర్చు చేసేందుకు.. మందు, విందు ఏర్పాటు కసరత్తులో నిమగ్నమైంది. ఇందుకయ్యే ఖర్చును మొత్తం పార్టీనే భరిస్తుందనే ప్రచారంలో ఉంది. ప్రతి నియోజకవర్గానికి సగటును రూ. 50 లక్షల వరకు వెచ్చించవచ్చని తెలిసింది. ఆ డబ్బులను నేరుగా ఎమ్మెల్యేలకు ఇవ్వకుండా జిల్లా పార్టీ సమన్వయ కర్తల చేతికి అందించనున్నట్టు తెలుస్తున్నది.

ఎన్నికలప్పుడే వెళ్తే..?

2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత తమను పట్టించుకునేవారే లేరని బీఆర్ఎస్ కార్యకర్తలు గుర్రుగా ఉన్నారు. స్థానికంగా ఉన్న నామినేటెడ్ పదవులను ఎమ్మెల్యేలు తమ అనుచరులకు ఇప్పించుకున్నారు. దీంతో చాలాచోట్ల ఉద్యమ లీడర్లకు చాన్స్ రాలేదని ఫిర్యాదులు ఉన్నాయి. దీన్ని గ్రహించిన బీఆర్ఎస్ పెద్దలు వెంటనే వారిని బుజ్జగించాలని నిర్ణయానికి వచ్చారు. అందుకే ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నట్టు ప్రచారం నడుస్తున్నది. వీటిపై గ్రామస్థాయి లీడర్లు అసంతృప్తిగా ఉన్నారు. మరోవైపు ఇంతకాలం పట్టించుకోకుండా ఇప్పుడు వారి దగ్గరికి వెళ్తే ఏం అంటారని భయం ఎమ్మెల్యేలను వెంటాడుతున్నది.

Read more:

సౌత్ గ్రూపుపైనే ఈడీ ఫోకస్.. పాలసీ డాక్యుమెంట్ లీక్‌పై ప్రత్యేక దృష్టి!

Tags:    

Similar News