దిశ, తెలంగాణ బ్యూరో: ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ చారిత్రక, వారసత్వ సంపద పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషి చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది వారసత్వ దినోత్సవాన్ని ‘హెరిటేజ్ ఛేంజెస్’ ఇతివృత్తం (థీమ్) తో నిర్వహించాలని ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ నిర్ణయించిందన్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో మన వారసత్వ కట్టడాల పరిరక్షణకు సంప్రదాయ రీతిలో ఎలా కృషి చేయాలన్నదే ఈ ఇతివృత్తం లక్ష్యమని వివరించారు.
దేశ సంస్కృతి, సాంప్రదాయాలను, కళలను, జీవన విధానాన్ని భవిష్యత్ తరాలకు అందించడం లో చారిత్రక, సాంస్కృతిక వారసత్వ సంపద కీలకమైన పాత్ర పోషిస్తుందని తెలిపారు. ‘వికాస్ భీ.. విరాసత్ భీ’ నినాదంతో దేశ అభివృద్ధితో పాటు ప్రపంచంలోనే అత్యంత విశిష్టతను కలిగిన దేశ వారసత్వ సంపదను పరిరక్షించుకోవడానికి, విభిన్నమైన మన సంస్కృతి, సాంప్రదాయాలను, కళలను భవిష్యత్ తరాలకు అందించటానికి ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాల్లో గిరిజన సర్క్యూట్, ఎకో-సర్క్యూట్ అభివృద్ధి కోసం స్వదేశీ దర్శన్ పథకంలో భాగంగా పర్యాటకులకు అవసరమైన సౌకర్యాలను కల్పించామన్నారు. తెలంగాణ లోని పలు పర్యాటక ప్రదేశాల అభివృద్ధికై కేంద్ర అనేక పనులు చేపట్టిందన్నారు.
అంతేకాకుండా, నాగార్జున సాగర్ లో బుద్ధవనం ప్రాజెక్టు నిర్మాణం కేంద్రం నిధులు అందజేసిందన్నారు. తెలంగాణలోని చారిత్రక సంపద పరిరక్షణకు, ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాల కొనసాగింపునకు గత తొమ్మిదేళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ. 610 కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రానికి చెందిన వివిధ సంగీత, నాటక, నాట్య కళలను పరిరక్షించి భవిష్యత్ తరాలకు అందించాలన్న ఉద్దేశ్యంతో హైదరాబాద్ నగరంలో సంగీత నాటక అకాడమీ ప్రాంతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం కోసం 10 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామన్నారు.
దీంతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు, వారి కుటుంబ సభ్యులకు సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు హైదరాబాద్ నగరంలో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయనున్న ‘సైన్స్ సెంటర్’ ప్రాజెక్టుకు 25 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని తెలంగాణ ముఖ్యమంత్రిని కోరుతూ పలుమార్లు లేఖలు కూడా రాశానని. ఈ రెండు విషయాలలో తెలంగాణ ప్రభుత్వం ఎంత త్వరగా స్పందించి సహకరిస్తే, అంత త్వరగా ఆయా ప్రాజెక్టులను ప్రారంభించటానికి కేంద్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉందన్నారు.