ఇంటర్‌లో స్టేట్ ఫస్ట్.. దిశ రిపోర్టర్ కుమారుడిని అభినందించిన ఎడిటర్ మార్కండేయ

దిశ రిపోర్ట్ కుమారుడిని ఎడిటర్ మార్కండేయ అభినందించారు.

Update: 2023-05-13 03:55 GMT

దిశ, జడ్చర్ల : దిశ రిపోర్ట్ కుమారుడిని ఎడిటర్ మార్కండేయ అభినందించారు. ఇటీవల బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాలలో దిశ దినపత్రిక నవాబుపేట విలేఖరి యాదిలాల్ కుమారుడు కె.ఎన్ సాయితేజ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ గ్రూప్‌లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన విషయం విధితమే. ఈ సందర్భంగా సాయి తేజను శుక్రవారం హైదరాబాద్‌లోని దిశ దినపత్రిక ప్రధాన కార్యాలయంలో దిశ ఎడిటర్ మార్కండేయ, బ్యూరో చీఫ్ విశ్వనాథ్, నెట్ వర్క్ ఇంచార్జ్ ప్రవీణ్ కుమార్ తదితరులు అభినందించారు. మొత్తం 1000 మార్కులకు గాను సాయితేజ 992 మార్కులు సాధించడం ఎంతో గొప్ప విషయమని, ఇలా మార్కులు సాధించడం అందరికీ సాధ్యం కాదని ఎడిటర్ మార్కండేయ అన్నారు. నిరంతర కృషి, పట్టుదల వల్లే ఇది సాధ్యమవుతుందని అన్నారు.

క్రమశిక్షణతో నిరంతరం కఠోరంగా శ్రమ పడితే ఘన విజయాలు వాటంతటఅవే మన దగ్గరికి వస్తాయన్నారు. సాయితేజ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం వెనుక ఆయన తల్లిదండ్రుల కృషి ఉందన్నారు. పదవ తరగతి చదివిన స్కూల్, ఇంటర్ కళాశాలల ప్రిన్సిపల్, అధ్యాపకుల కృషి ఎంతగానో ఉంటుందన్నారు. ఇలాంటి ఆణిముత్యం లాంటి అబ్బాయిని కన్న ఆయన తల్లిదండ్రులు ఎంతో అభినందనీయులని అన్నారు. సాయితేజను స్టేట్ ఫస్ట్ ర్యాంకర్‌గా తీర్చిదిద్దడంలో ఆయన చదివిన పాఠశాల, కళాశాలల యాజమాన్యాల కృషి అమోఘమన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసి వారిని ఉన్నత లక్ష్యాల వైపు తీర్చిదిద్దడంలో విద్యాసంస్థల పాత్ర ఎంతగానో ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. సాయి తేజ తన లక్ష్యాలను సాధించి, ఉన్నత శిఖరాలను అధిరోహించి రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తెచ్చే విధంగా ఎదగాలని ఎడిటర్ మార్కండేయ కాంక్షించారు. ఈ సందర్భంగా ఎడిటర్ మార్కండేయ, బ్యూరో చీఫ్ విశ్వనాథ్, నెట్ వర్క్ ఇన్‌ఛార్జ్ ప్రవీణ్ కుమార్, దినపత్రిక అన్ని విభాగాల ఇన్ఛార్జీలు సాయి తేజకు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..