ఢిల్లీ లిక్కర్ స్కామ్: MLC కవిత మాజీ అడిటర్ బుచ్చిబాబుపై ఈడీ ప్రశ్నల వర్షం!
దేశంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు విచారణపై ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) స్పీడ్ పెంచింది.
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు విచారణపై ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మళ్లీ స్పీడ్ పెంచింది. ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాజీ అడిటర్ బుచ్చిబాబును ఈడీ ఇవాళ విచారిస్తోంది. బుధవారం ఉదయం నుండి బుచ్చిబాబుపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. బుచ్చిబాబు స్టేట్మెంట్‌ను అధికారులు రికార్డ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడిగా ఉన్న బుచ్చిబాబు వాంగ్మూలం ఈ కేసులో కీలకంగా మారనుంది.
ఎమ్మెల్సీ కవిత మాజీ అడిటర్ బుచ్చిబాబును ఈ కేసులో ఈడీ మరోసారి విచారిస్తుండటంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ కేసు విచారణలో గత కొన్ని రోజులుగా స్పీడ్ తగ్గించిన అధికారులు.. దర్యాప్తులో మళ్లీ వేగం పెంచారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుతో సంబంధం ఉన్న తెలుగువారిని ఈడీ అధికారులు గత వారం విచారించారు. ఇదే కేసులు ఆరోపణలు ఎదుర్కొన్న ఎమ్మెల్సీ కవితను సైతం ఈడీ విచారించిన విషయం తెలిసిందే. తెలంగాణలో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ స్పీడ్ పెంచడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.