బ్రేకింగ్: TSPSC పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం.. బోర్డు చైర్మన్, సెక్రటరీకి ఈడీ నోటీసులు
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ దర్యాప్తు వేగం పెంచింది.
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: టీఎస్పీఎస్సీ బోర్డు పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో ఈడీ అధికారులు క్రమంగా దూకుడు పెంచుతున్నారు. ఇప్పటికే బోర్డు ఉద్యోగులు సత్యనారాయణ, శంకర్‌లక్ష్మిని కార్యాలయానికి పిలిపించుకుని విచారించిన ఈడీ అధికారులు తాజాగా బోర్డు ఛైర్మన్, సెక్రటరీలను ప్రశ్నించారు. రాష్ర్టవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో మనీలాండరింగ్ జరిగినట్టుగా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఈడీ అధికారులకు లిఖిత పూర్వక ఫిర్యాదు కూడా చేశారు. ఈ ఫిర్యాదుతో పాటు పబ్లిక్ డొమైన్‌లో ఉన్న వివరాల ఆధారంగా ఈడీ అధికారులు టీఎస్పీఎస్సీ బోర్డు పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీపై కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో మొత్తం 31లక్షల రూపాయల లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు.
ఈ నేపథ్యంలోనే కాన్ఫిడెన్షియల్రూం ఇన్ఛార్జ్శంకర్లక్ష్మితో పాటు మరో ఉద్యోగి సత్యనారాయణను కొన్నిరోజుల క్రితం బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి పిలిపించి ప్రశ్నాపత్రాలు బయటకు ఎలా వచ్చాయన్న అంశంపై ప్రశ్నించారు. తాజాగా నోటీసులు జారీ చేసి మరీ బోర్డు ఛైర్మన్జనార్ధన్రెడ్డి, సెక్రటరీ అనితా రాంచంద్రన్‌లను సోమవారం తమ కార్యాలయానికి పిలిపించుకుని ఈడీ అధికారులు విచారించారు. కాన్ఫిడెన్షియల్రూంలోని కంప్యూటర్‌నుంచి ప్రశ్నాపత్రాలు ఎలా లీకయ్యాయి? బోర్డు ఉద్యోగుల పాత్ర తదితర అంశాలపై ఇద్దరి నుంచి వాంగ్మూలాలు తీసుకుని రికార్డు చేశారు.