Delhi liquor scam: స్కామ్‌లో వరుస అరెస్ట్‌లతో MLC కవితకు బిగుస్తున్న ఉచ్చు?
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు ఇప్పటివరకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తెలంగాణ, ఢిల్లీకి చెందిన వ్యక్తులను అరెస్టు చేయగా.. తాజాగా ఇప్పుడు ఈ కేసు పంజాబ్‌కు చేరింది. ఈ కేసులో పంజాబ్‌కు చెందిన గౌతమ్ మల్హోత్రాను ఈడీ బుధవారం అరెస్ట్ చేసింది. గౌతమ్ మల్హోత్రా తండ్రి దీపక్ మల్హోత్రా శిరోమణి అకాళీదళ్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే కావడంతో పంజాబ్ రాజకీయాల్లోనూ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు సంచలనంగా మారుతోంది. గౌతమ్ మల్హోత్రాను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు ఇవాళ రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరిచారు.
ఇదిలా ఉంటే.. తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో దర్యాప్తు సంస్థలు స్పీడ్ పెంచాయి. తాజాగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాజీ చార్టెడ్ అకౌంట్ గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ బుధవారం అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. కవిత సన్నిహితుడిని అరెస్ట్ చేయడంతో ఈ పరిణామం బీఆర్ఎస్ శ్రేణుల్లో హాట్ టాపిక్ అవుతోంది.
ఇప్పటికే ఓ సారి కవితను సీబీఐ ప్రశ్నించగా.. ఇటీవలే ఈడీ సప్లిమెంటరీ చార్జిషీట్‌లో కవిత పేరును ప్రస్తావించింది. ఇంతలోనే కవిత మాజీ చార్టెడ్ అకౌంట్ అరెస్ట్ పరిణామంతో కవిత విషయంలో ఉచ్చు బిగిస్తుందా అనే చర్చ జరుగుతోంది. వరుస అరెస్టులు నేపథ్యంలో త్వరలోనే కవితను అరెస్ట్ చేస్తారా అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య బిగ్ ఫైట్ నడుస్తోంది. దీంతో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో డెవలప్మెంట్స్ గులాబీ పార్టీలో ఎలాంటి ప్రకంపనలకు కారణం అవుతుందో చూడాలి మరి.