రుణమాఫీ: రీ షెడ్యూల్ లోన్ల పై ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు

రైతురుణమాఫీ షరతుల విషయంలో ప్రభుత్వం తీరుపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Update: 2024-07-16 11:10 GMT

దిశ, డైనమిక్ బ్యూరో:ఎలాంటి షరతులు లేకుండా రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు షరతులు విధించి రాష్ట్ర రైతులను మోసగిస్తున్నదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ మార్గదర్శకాలు రైతులకు ఉరితాళ్లుగా మారాయన్నారు. మంగళవారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వ్యక్తిగతంగా వివిధ కారణాలతో అనేక మంది రైతులు తమ రుణాలను రీ షెడ్యూల్ చేసుకున్నారని, ఐటీ రిటర్న్ ఫైల్ చేసుకున్నారని వారందరికీ ఇప్పుడు రుణమాఫీ చేయబోమని షరతు విధించడం సరికాదన్నారు. అధికారం ఇచ్చారు కాబట్టి ఐదేళ్లు ఏదైనా చేయవచ్చు అనే అహంకారం రేవంత్ రెడ్డి సర్కార్ లో కనిపిస్తున్నదని మోసం చేసేవాళ్లకు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. రుణమాఫీకి తెల్ల రేషన్ కార్డు ప్రామాణికం అంటున్నారు.. 3.5 ఎకరాల తరి పొలం, 7 ఎకరాల మెట్ట పొలం ఉన్న వారికి రేషన్ కార్డు ఇవ్వరు. ఈ విషయం తెలియదా? రేవంత్ రెడ్డి చదువుకున్నారా? అని ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో తెల్లరేషన్ కార్డు ఇవ్వక పదేళ్లు అవుతున్నది. ఈ ప్రభుత్వం వచ్చాక కూడా రేషన్ కార్డులు ఇవ్వకుండా ఇప్పుడు రుణమాఫీకి తెల్లరేషన్ కార్డుకు లింకు పెట్టడం ఏంటని నిలదీశారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఏడు నెలలు కాకముందే ఏడు రకాల అవతారాలెత్తుతున్నారని రైతుల శాపనార్థాలు ఈ ప్రభుత్వానికి తగులుతాయన్నారు. విశ్వసనీయత లేనందుకే బీఆర్ఎస్ ప్రజలు బుద్ధి చెప్పారని మోసం చేసే కాంగ్రెస్ పార్టీకి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.

సోనియాను దేవత అన్నారు.. ఆ దేవత మిద మీద ప్రమాణం చేశారు?:

కుటుంబాల్లో విభజన జరిగినా ఒకే రేషన్ కార్డు కారణంతో వారికి రుణమాఫీ వచ్చే పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు, ఔట్ సోర్సింగ్ లో పని చేసే వారికి, సింగరేణి కార్మికులకు రేషన్ కార్డులు లేవవి రేషన్ కార్డు నిబంధనల పేరుతో రుణమాఫీ ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నదని ధ్వజమెత్తారు. రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్న 69 లక్షల మంది రైతులకు నిరాశే మిగలబోతున్నదన్నారు. ఇన్ కమ్ ట్యాక్స్ పెద్ద పెద్ద కంపెనీలే కట్టడం లేదని, ఇంటి రుణాలు, వాహన రుణాలు, పిల్లలు విదేశాలకు వెళ్లేందుకు సామాన్య ప్రజలంతా ఐటీ చెల్లిస్తున్నారని వీరిలో సింగరేణి కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, అక్కడక్కడా రైతులూ చెల్లిస్తున్నారన్నారు. ఐటీ చెల్లిస్తున్నారనే పేరుతో భూమిని నమ్ముకున్న నిజమైన రైతులకు ఎగనామం పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారని ధ్వజమెత్తారు. మా దేవత సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా రుణమాఫీ చేస్తామని చెప్పారో ఆ దేవత పేరు మీద ప్రమాణం చేసి మోసం చేయడం ఏంటని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి తన మాటలను నమ్మడం లేదని చివరకు దేవుళ్లపై ఒట్లు పెట్టుకుని సీఎం మోసం చేశారని ధ్వజమెత్తారు. 34 వేల కోట్ల రూపాయల రుణమాపీని అన్ కండిషనల్ గా ఏకకాలంలో చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఈ కండీషన్లను పెట్టి అల్లికి అల్లి.. సున్నకు సున్నగా మార్చేశారని ఎద్దేవా చేశారు.

మీ మేనిఫెస్టో చిత్తు కాగితం:

రేవంత్ రెడ్డి నీ మేనిఫెస్టో చిత్తుకాగితంతో సమానం అని, మీకు కావాల్సిందల్లా ఎమ్మెల్యేలు మాత్రమే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిరాయింపుల్లో కేసీఆర్ జుట్టులోనే పుట్టినట్లుగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. పార్టీ ఫిరాయింపులపై రాహుల్ గాంధీ ఒక రకంగా మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి మరో రకంగా చేస్తున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడంపై ఉన్న ధాస్య రైతు రుణమాఫీ, ఇచ్చిన హామీల నెరవేర్చే విషయంలో లేదన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా అన్ కండిషనల్ గా రైతురుణమాఫీ చేయాలని లేకుంటే ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదని బీజేపీ తరపున హెచ్చరిస్తున్నాన్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ ను బీజేపీ ఎందుకు కూలదోస్తుందని అన్నారు. ఎవరైనా ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరాలనుకుంటే రాజీనామా చేసిన తర్వాతే చేర్చుకుంటామన్నారు. రాజ్యాంగ బద్దంగా సంక్రమించబడిన పదవుల్లో ఎవరున్నా.. నిర్దేశించిన ప్రకారం వారి ప్రోటోకాల్ అమలు చేయాలన్నారు. కేసీఆర్ హయాంలో ప్రోటోకాల్ పాటించడం లేదన్న రేవంత్ రెడ్డి ఇవాళ ఎందుకు ప్రోటోకాల్ పాటించడం లేదని ప్రశ్నించారు. జేఎన్టీయూ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్ సభ నియోజకవర్గం పరిధిలోకే వస్తుందని కానీ తనకు ఇన్విటేషన్ ఇవ్వలేదని ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని చెప్పారు.


Similar News