Eatala Rajender: 'నీకు ఓట్లు వేసింది బ్రోకర్ గిరి చేయడానికి కాదు'.. రేవంత్ రెడ్డిపై ఈటల ఘాటు వ్యాఖ్యలు
సీఎం రేవంత్ రెడ్డిపై ఈటల ఘాటు వ్యాఖ్యలు చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: రైతుల భూములు బలవంతంగా తీసుకునే అధికారం ప్రభుత్వానికి లేదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajender) అన్నారు. వికారాబాద్ జిల్లా లగచర్ల (Lagacherla) ఘటనలో పలువురిని పోలీసులు అరెస్టు చేయడంపై మంగళవారం ఆయన స్పందించారు. ఈ మేరకు ఆయన ఢిల్లీ నుంచి వీడియో విడుదల చేశారు. మా భూములు లాక్కుని తమ ఉపాధి మీద దెబ్బకొట్టవద్దని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వినకుండా ఫార్మా కంపెనీలకు రైతుల భూములను అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రైతుల ఆందోళనలను అర్థం చేసుకోకుండా వారి మాటలను పెడచెవిన పెట్టి ప్రభుత్వం భూసేకరణ కోసం సమావేశం ఏర్పాటు చేసిందని దాంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు. ఈ ఘటనను అడ్డం పెట్టుకొని కొడంగల్ చుట్టుపక్కల మండలాల్లో ఇంటర్నెట్, కరెంటు బంద్ చేసి వందల మంది పోలీసులు గ్రామాలలో మోహరించి అరెస్టు చేయడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తున్నదన్నారు. అక్రమ కేసులు పెడితే మంచిది కాదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గతంలో ముచ్చర్లలో సేకరించిన భూమిని ఫార్మా కంపెనీలకు (Pharma Company) అప్పజెప్పాలని చూస్తే బీజేపీ సహా కాంగ్రెస్ వ్యతిరేకించిందని గుర్తు చేశారు. అప్పుడు వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు భూములు గుంజుకుని రైతుల నోట్లో మట్టికొట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ఓట్లేసింది మధ్యవర్తిత్వం చేయడానికి కాదు:
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఉద్యోగ కల్పన చేస్తామని చెప్తున్నారని కానీ ఇప్పటివరకు భూములు కోల్పోయిన రైతుల కుటుంబాలకు పూర్తి నష్టపరిహారం, ఇచ్చిన హామీలు అమలు కాలేదని ఈటల ఆరోపించారు. ఫార్మా కంపెనీలకు అవసరమైతే వారే భూసేకరణ చేసుకుంటారు. కానీ ప్రభుత్వం మధ్యలో బ్రోకర్ లాగా వ్యవహరించాల్సిన అవసరం లేదన్నారు. రేవంత్ రెడ్డికి ప్రజలు ఓట్లేసింది బ్రోకర్ గిరి చేయడానికో, మధ్యవర్తిత్వం చేయడానికో కాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పేదల భూములు గుంజుకొని పెద్దలకు కట్టబెట్టి ఆ భూములతో డబ్బులు సంపాదించే హక్కు ఎవరికీ లేదన్నారు. ఫార్మాసిటీ పేరిట అక్కడి ప్రాంత ప్రజానికంపై ప్రభుత్వం చేస్తున్న దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నానని వారి మీద కేసులు పెడితే యావత్ తెలంగాణ సమాజం తిరుగుబాటు చేస్తుందని హెచ్చరిస్తున్నామన్నారు. స్థానిక ప్రజలకు బీజేపీ (BJP) అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.
మహారాష్ట్ర ప్రజలకు ఈటల విజ్ఞప్తి:
హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో ఎలా ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారో మళ్లీ అదే తరహాలో మహారాష్ట్ర ప్రజానీకాన్ని కూడా మోసం చేసే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోందని ఈటల రాజేందర్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అబద్దాలను మేధావులు, ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఢిల్లీ నుంచి మహారాష్ట్ర ప్రజలకు ఈటల విజ్ఞప్తి చేశారు. ఎన్ని అడ్డదారులు తొక్కైనా అలవికాని హామీలు ఇచ్చి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ చూస్తున్నదని ధ్వజమెత్తారు. దేశ ప్రజలచేత తిరస్కరించబడిన పార్టీ కాంగ్రెస్ అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న హిమాచల్ ప్రదేశ్ లో దివాలా తీసిందని కర్ణాటకలో చేతులెత్తేసిందన్నారు. తెలంగాణలో ఉచిత బస్సు తప్ప ఏ హామీ పూర్తిగా అమలు కాలేదని విమర్శించారు. అలవి కానీ హామీలు ఇచ్చి అభాసుపాలు కావొద్దని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేనే స్వయంగా చెప్పే పరిస్థితి వచ్చిందన్నారు. భారతీయ జనతా పార్టీని గెలిపించుకుందామని మహారాష్ట్ర ప్రజలను కోరారు.