Duplicate Certificates: నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు.. హైదరాబాద్ పరిధిలో 200 మంది రిక్రూట్!
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉద్యోగ నియామకాల ప్రక్రియను వేగవంతం చేసింది.
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉద్యోగ నియామకాల ప్రక్రియను వేగవంతం చేసింది. నోటిఫికేషన్లు జారీ చేస్తూ ఖాళీలను భర్తీ చేస్తున్నది. అయితే ఇందులో కొందరు ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాల్లో చేరుతున్నారని పలువురు నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇలా ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే 200 మంది వరకు ఉంటారని పేర్కొంటున్నారు. ఇందులో కానిస్టేబుళ్లతో పాటు ఎస్ఐ, ఏఈఈ, డీఎస్సీ పోస్టుల్లో చేరారని చెబుతున్నారు. దీనిపై జిల్లాస్థాయి అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. బీఆర్ఎస్ హయాంలో మూతపడిన స్కూళ్ల కేంద్రంగా ఫేక్ సర్టిఫికెట్ల దందా జరిగిందని ఆరోపిస్తున్నారు.
డీఎస్సీ-2024లో..
ఇటీవల డీఎస్సీ 2024 ద్వారా జరిగిన టీచర్ల నియామకాల్లోనూ నకిలీ సర్టిఫికెట్లతో కొందరు చేరినట్లు నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. అచ్చంపేటలో తాజాగా ఇలాంటి ఘటనే ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఈ అంశంపై ఇప్పటికే విచారణ కొనసాగుతున్నది. అయితే అలాంటి ఘటనలే హైదరాబాద్ జిల్లాలోనూ జరిగినట్లు నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. స్థానికులు కాకపోయినప్పటికీ నకిలీ ధ్రువపత్రాలను సృష్టించి.. ఇక్కడ నియామకమైనట్లు పేర్కొంటున్నారు. ఇలా చేరిన వారిలో కానిస్టేబుల్ నుంచి మొదలుకుని ఎస్ఐ, ఏఈఈ, టీచర్లుగా పోస్టుల్లో నియామకమైనట్లు చెబుతున్నారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో మూతపడిన స్కూళ్లలో చదివినట్లుగా ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందారని, ఇలాంటి ప్రాంతంలో అయితే ఎవరికీ అనుమానం రాదనే ధీమాతో వారు ఈ పని చేసి ఉంటారని భావిస్తున్నారు. సాధారణంగా హైదరాబాద్ అంటేనే హాట్ కేక్. అలాంటి ప్రాంతంలో అయితే నగరంలో ఉండటంతో పాటు హెచ్ఆర్ఏ అలవెన్సులు అధికంగా పొందవచ్చనే దురుద్దేశంతో ఇలా చేసి ఉంటారని అభిప్రాయపడుతున్నారు. దీనికి అధికారుల ప్రోద్బలం కూడా ఉండే అవకాశముందని నిరుద్యోగులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు.
రికార్డుల ట్యాంపరింగ్?
ఇటీవల డీఎస్సీ-2024 నియామక పత్రాలను రాష్ట్ర ప్రభుత్వం అందించింది. అందులో ఎస్జీటీగా ఉద్యోగం పొందిన ఒక యువతి తన స్థానికతను కాదని హైదరాబాద్ లో ఉద్యోగం పొందిందని నిరుద్యోగులు పలువురు ఫిర్యాదు చేశారు. సదరు యువతి వాస్తవానికి 1 నుంచి 7వ తరగతి వరకు అమ్రాబాద్ లో చదువుకుందని చెబుతున్నారు. ఆపై 8 నుంచి 10వ తరగతి వరకు కాచిగూడలో చదువుకుందని చెబుతున్నారు. దీనికోసం పలు రికార్డులను ట్యాంపరింగ్ చేశారని వారు వాపోతున్నారు. ఆమె సర్టిఫికెట్ల ఆధారంగా ఆమెకు నాగర్ కర్నూల్ జిల్లా స్థానికత అవుతుందని చెబుతున్నారు. కానీ సదరు యువతి ఫేక్ బోనఫైడ్ సర్టిఫికెట్లతో సికింద్రాబాద్ లోని ఒక పాఠశాలలో ఉద్యోగం పొందిందని వాపోతున్నారు.
బీఆర్ఎస్ హయాంలోనే దందా
ఈ నకిలీ సర్టిఫికెట్ల దందా బీఆర్ఎస్ హయాంలోనే జరిగినట్లు తెలుస్తోంది. ఆ సమయంలోనే పలువురు ట్యాంపరింగ్ కు పాల్పడ్డారని డాక్యుమెంట్ల ద్వారా స్పష్టమవుతోందని పలువురు అభ్యర్థులు వాపోతున్నారు. 2018 నుంచి 2023 మధ్యలో ఈ దందా జరిగినట్లుగా అనుమానం వ్యక్తంచేస్తున్నారు. కేవలం హైదరాబాద్ పరిధిలో దాదాపు 200 మంది ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందారని ఆరోపణలు చేస్తున్నారు. కాగా, నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందారని హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా ఏమాత్రం పట్టించుకోవడంలేదని పలువురు అభ్యర్థులు వాపోయారు. అధికారులు పట్టించుకోకుంటే ఆందోళనలు చేపడుతామని హెచ్చరిస్తున్నారు. తాజాగా హిమాయత్ నగర్ కు చెందిన విద్యాశాఖ అధికారులకు సైతం ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
అర్హత లేని వారికి ఉద్యోగాలు
తప్పుడు ధ్రువపత్రాలతో అర్హత లేని వారు ఉద్యోగాలు పొందారు. ఈ అంశంపై అధికారులు స్పందించి పూర్తిస్థాయిలో విచారణ జరిపాలి. నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇన్వాల్వ్ అయిన ఉపాధ్యాయులపైనా చర్యలు తీసుకోవాలి. మూత పడిన స్కూళ్ల ద్వారా ఈ నకలీ సర్టిఫికెట్ల దందా సాగుతోంది. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి బాధ్యులను శిక్షించాలి.
-ఏ సునీత, నిరుద్యోగి
అర్హులకు న్యాయం చేయండి
విచారణ చేపట్టి నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన వారిని గుర్తించాలి. ఇలాంటి ఘటనల ద్వారా అర్హత కలిగిన నిరుద్యోగులకు అన్యాయం జరుగుతున్నది. సత్వర విచారణ చేపట్టి, నిర్ధారణ జరిపి.. వారిని ఉద్యోగాల నుంచి తొలగించాలి. అర్హులైన నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేలా చూడాలి.
-కే లలిత, నిరుద్యోగి