చెరువులు వెలవెల.... చేపల పంపిణీ ఎలా..?

నల్గొండ జిల్లాలో వర్షాభావ పరిస్థితుల వల్ల మత్స్య పారిశ్రామిక రంగం కుదేలయ్యే పరిస్థితులు నెలకొన్నాయి...

Update: 2024-08-22 03:17 GMT

దిశ నల్లగొండ బ్యూరో/ యాదాద్రి కలెక్టరేట్: జిల్లాలో వర్షాభావ పరిస్థితుల వల్ల మత్స్య పారిశ్రామిక రంగం కుదేలయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాకాలం ప్రారంభమై మూడు నెలలు ముగుస్తున్నప్పటికీ చెరువులు నిండకపోవడంతో మత్స్య రంగంపై ఆధారపడ్డ కార్మికులు ఆందోళన గురవుతున్నారు. జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ఇప్పటివరకు భారీ వర్షాలకు ఇచ్చిన దాఖలాలు లేవు. లోటు వర్షపాతం నమోదు కావడంతో చెరువుల్లో నీరు చేరలేదు. ఇప్పటికే జలకళ ఉండాల్సిన చెరువులు వెలవెల పోతున్నాయి. చేపల పంపిణీ సందిగ్ధంలో పడింది.. ఇలా ఉంటే ఇప్పటికే టెండర్ పూర్తయి చేపల సరఫరా చేసే కార్యక్రమం దాదాపు పూర్తి కావాల్సి ఉండే..... కానీ ఉమ్మడి జిల్లాలో టెండర్ వేశారు కానీ వాటిని ఓపెన్ చేయలేదు.

ఉమ్మడి జిల్లాలో చెరువులు....

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రతి ఏటా చేప పిల్లలు పంపిణీ చేసే చెరువులు సుమారు 2484 ఉన్నాయి. అందులో దాదాపు 12 కోట్లకు పైగా ఉచిత చేప పిల్లలను పంపిణీ చేసేందుకు మూడు జిల్లాల యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేసింది.. యాదాద్రి భువనగిరి జిల్లాలో 700 చెరువులు, నల్గొండ జిల్లాలో 1163 చెరువులు, 621 చెరువులు ఉన్నాయి. ఈ చెరువుల్లో రెండు రకాల చేప పిల్లలను సరఫరా చేయాలని ప్రభుత్వం భావించింది అందులో 80-100 ఎంఎం, 35 నుంచి 40 ఎంఎం ఉన్నాయి... ప్రతి ఏటా కూడా ఈ సైజు చేప పిల్లలే పంపిణీ చేస్తుంటారు.

పూర్తికాని టెండర్....

చెరువులలో సరఫరా చేయడానికి ప్రతి ఏటా కాంట్రాక్టర్ల నుంచి ప్రభుత్వం ఆయా జిల్లాల స్థాయిలో టెండర్లు ఆహ్వానిస్తుంటారు. అందులో భాగంగానే ఈ ఏడాది కూడా మూడు జిల్లాలో జూలై నుంచి టెండర్లు పిలిచారు. వారం రోజుల క్రితం వరకు టెండర్ దాఖలు దశ ముగిసింది. దరఖాస్తులను ఓపెన్ చేయలేకపోవడం ఒకటే మిగిలింది. అయితే నల్గొండ జిల్లాలో సుమారు 6 కోట్ల చేప పిల్లలు సరఫరా చేయడానికి కేవలం నలుగురు కాంట్రాక్టర్లు, సూర్యాపేటలో 3.41కోట్ల చేప పిల్లలు పంపిణీ చేయడానికి ఐదుగురు కాంట్రాక్టర్లు, యాదాద్రి భువనగిరి జిల్లాలో ముగ్గురు మాత్రమే టెండర్ దాఖలు చేశారు..

జలకళ లేని చెరువులు...

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. జూన్ జూలై మాసాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పినప్పటికీ వర్షం జాడే కనిపించకుండా పోయింది.ఆగస్టులోనే భారీ వర్షాలు ఉన్నాయని భావించారు కానీ అది జరగలేదు. ఉమ్మడి జిల్లాలో కాకుండా ఇతర ప్రాంతాల్లో కురిసిన వర్షం కారణంగా నాగార్జున సాగర్,మూసీకి జలకళ వచ్చింది. మిగతా ప్రాంతాల్లో ఉన్న చెరువులు నీటి జాడ కనిపించలేదు. ప్రస్తుతం చెరువులో ఉన్న మీరు కూడా సాగునీటి కోసం వాడితే ఆ మాత్రం నీరు కూడా మిగలదు. గతంలో చేపల కాంట్రాక్ట్ కోసం పోటీపడ్డ కాంట్రాక్టర్లు ఈసారి చాలా వరకు తగ్గినట్లు తెలుస్తోంది. దానికి ప్రధాన కారణం గతంలో చేసిన కాంట్రాక్టుకు బిల్లులు రాకపోవడం, ఇప్పుడున్న పరిస్థితుల్లో చేప పిల్లల సరఫరాకు చెల్లించి ధర గిట్టుబాటు కావడం లేదని కారణమని సమాచారం..ఏది ఏమైనా ఈసారి ఉచిత చేపల పంపిణీ అంతంత మాత్రమే ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది.


Tags:    

Similar News