డ్రంకెన్ డ్రైవ్, ట్రాఫిక్ నియంత్రణకు ట్రాన్స్‌జెండర్లు
సిగ్నల్ జంపింగ్, ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా వెళ్లే వారిని నిరోధించేందుకు హోంగార్డుల తరహాలో ట్రాన్స్‌జెండర్ల సేవలు వినియోగించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు.
దిశ, తెలంగాణ బ్యూరో: సిగ్నల్ జంపింగ్, ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా వెళ్లే వారిని నిరోధించేందుకు హోంగార్డుల తరహాలో ట్రాన్స్‌జెండర్ల సేవలు వినియోగించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. నగరంలో నిర్వహించే డ్రంక్ అండ్ డ్రైవ్‌లోనూ వారి సేవలను వినియోగించుకోవాలని ఆయన సూచించారు. నగరంలో ట్రాఫిక్ ఇబ్బందుల నియంత్రణకు ట్రాన్స్‌జెండర్ల నియమించడంపై దృష్టి సారించాలని రేవంత్‌రెడ్డి అన్నారు.
గతంలో నిర్ణయించిన విధంగా తొలి దశలో రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ట్రాన్స్ జెండర్లను నియమించాలని, తద్వారా తాగి వాహనాలు నడపే వారి సంఖ్యను తగ్గించవచ్చని అన్నారు. వారికి హోంగార్డ్ తరహాలో జీత భత్యాలను సమకూర్చేలా విధివిధానాలు రూపొందించాలని, ప్రత్యేక డ్రెస్ కోడ్ రూపొందించాలని ఆదేశించారు. వీలైనంత త్వరగా ప్రయోగాత్మకంగా నిర్ణయాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి అదేశించారు.