ఇక్కడ అంత ఈజీ కాదు.. తెలంగాణ కాంగ్రెస్‌కు ‘డబుల్’ టాస్క్!
కర్ణాటక స్ట్రాటజీతోనే తెలంగాణలో ముందుకు వెళ్లాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలిసింది. అయితే కర్ణాటక, తెలంగాణలో వేర్వేరు పరిస్థితులు ఉన్నాయి. కేంద్రంలో, కర్ణాటకలో బీజేపీనే అధికారంలో ఉండడంతో ప్రభుత్వ తప్పిదాలను ఎండగట్టడం కాంగ్రెస్‌కు ఈజీ అయింది.
దిశ, తెలంగాణ బ్యూరో: కర్ణాటక స్ట్రాటజీతోనే తెలంగాణలో ముందుకు వెళ్లాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలిసింది. అయితే కర్ణాటక, తెలంగాణలో వేర్వేరు పరిస్థితులు ఉన్నాయి. కేంద్రంలో, కర్ణాటకలో బీజేపీనే అధికారంలో ఉండడంతో ప్రభుత్వ తప్పిదాలను ఎండగట్టడం కాంగ్రెస్‌కు ఈజీ అయింది. ఫుల్ మెజారీటీతో అధికారంలోకి వచ్చింది. తెలంగాణనూ అవే ఫలితాలు వస్తాయని కాంగ్రెస్ పార్టీ పైకి చెబుతున్నా, ఇంటర్నల్‌గా అంత సులువు కాదనేది పార్టీ నేతలకూ తెలుసు. రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ఇప్పుడు రెండు పార్టీలతో కొట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీజేపీతోపాటు బీఆర్ఎస్‌పై కూడా యుద్ధం చేయాల్సి వస్తున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తప్పిదాలను ప్రశ్నిస్తూ ముందుకు సాగడం కాంగ్రెస్‌కు బిగ్ టాస్క్. అయితే దీన్ని ఎలా ఎదుర్కొవాలనే దానిపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇప్పటికే తనదైన శైలిలో ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రియాంక గాంధీ ఆదేశాలతో ఈ టాస్క్ మొదలు కానున్నట్లు రేవంత్ సన్నిహితులు చెబుతున్నారు.
మతతత్వం... కమీషన్లే ఎజెండా...!
జై శ్రీరామ్‌కు బదులు ఈ సారి బీజేపీ జై బజరంగ్ బళీ నినాదాన్ని ఎత్తుకున్నది. దేవుళ్ల సెంటిమెంట్ ను రాజకీయాలకు వాడుకుంటున్నారని గ్రహించిన కన్నడ ప్రజలు, మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా తీర్పు చెప్పారు. తెలంగాణలోనూ బీజేపీ మతతత్వ పార్టీ అని చెబుతూనే, దేవుళ్ల సెంటిమెంట్ ను ఎలా వాడుకుంటుందనేది ప్రజలకు వివరించేందుకు కాంగ్రెస్ వ్యూహ రచన చేస్తున్నది. వివిధ మతపెద్దలతో టీపీసీసీ కార్యవర్గం అతి త్వరలో భేటీ కానున్నట్లు తెలిసింది. బీజేపీ వైఖరిని కుల పెద్దలు, మత నాయకులకు వివరిస్తూ ముందుకు వెళ్లాలనేది కాంగ్రెస్ పార్టీ టార్గెట్. బీఆర్ఎస్ సర్కార్ పై కూడా అదే స్థాయిలో యుద్ధం చేయడానికి కాంగ్రెస్ సిద్ధమవుతున్నది. సర్కార్ 40 శాతం కమీషన్లు తీసుకుంటుందనే ప్రచారాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని నిర్ణయించినట్లు తెలిసింది. దళిత బంధు ఇవ్వడానికి రూ.3 లక్షల వరకు వసూల్ చేశారని సీఎం చెప్పిన అంశాన్ని ప్రజలకు పదే పదే గుర్తు చేయనున్నది. పబ్లిక్ ప్లేస్ లలో భారీ స్థాయిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నది. అయితే కాంగ్రెస్ చేసే ప్రచారం తో కేసీఆర్ ప్రభుత్వానికి ఎంత వరకు డ్యామేజ్ అవుతుందనేది ఇప్పుడే స్పష్టంగా చెప్పలేమని పొలిటికల్ విశ్లేషకులు చెబుతున్నారు.
సమన్వయమే సమస్య?
రెండు పార్టీలపై పోరాడడానికి పార్టీలోని అంతర్గత సమస్యలను పరిష్కరించి, నేతల మధ్య సమన్వయం చేయడం కాంగ్రెస్ కు పెద్ద సవాలే. కర్ణాటకలో వర్గ విభేధాలు ఉన్నప్పటికీ, ఎక్కడ బయటపడకుండా పార్టీ ని అధికారంలోకి తీసుకువచ్చేందుకు సమిష్టి కృషి చేశారు. గెలుపును కూడా ఆస్వాదిస్తున్నారు. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు. పార్టీ ఆదేశాలు, టీపీసీసీ ప్రెసిడెంట్ సలహాలు, సూచనలను కొందరు సీనియర్లు పెడచెవిన పెడుతున్నారు. కాంగ్రెస్ కు ఇక్కడే మైనస్ అవుతున్నది. క్షేత్రస్థాయిలో పనిచేసే కేడర్ లోనూ తెలియని ఆందోళన ఉన్నది. పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశమున్నా, సమన్వయం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. దీంతో పార్టీకి నష్టం జరుగుతున్నది. దీంతో సునీల్ కనుగోలు టీమ్సూచన మేరకు పార్టీ నేతలంతా ఒకతాటి పైకి వస్తామని పైకి హామీ ఇస్తున్నారు. కానీ ఈ సార్వత్రిక ఎన్నికల్లో నేతలంతా సమిష్టి పోరాటం చేస్తారా? లేదా? అనేది చూడాలి.
Read more:
కర్ణాటక ఫలితాల ఎఫెక్ట్: కాంగ్రెస్‌లోకి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు?
స్పీడ్ పెంచనున్న కాంగ్రెస్.. తెలంగాణలో ఆ మంత్రం పనిచేస్తుందా