ఇందిరమ్మ రాజ్యం అంటే రేషన్ బియ్యం ఎగ్గొట్టుడేనా..? సర్కారుకు కేటీఆర్ సూటి ప్రశ్న
కాంగ్రెస్ ప్రభుత్వం ఉగాదికి సన్నబియ్యం అని ఉన్న బియ్యం కూడా ఊడబీకిందని, ప్రజాపాలన అంటే పస్తులేనా అని మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు.

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం ఉగాదికి సన్నబియ్యం అని ఉన్న బియ్యం కూడా ఊడబీకిందని, ప్రజాపాలన అంటే పస్తులేనా అని మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) ప్రశ్నించారు. పేదల కోసం ప్రభుత్వం అందజేసే రేషన్ బియ్యం ఇవ్వకపోవడంపై ట్విట్టర్ వేదికగా స్పందించిన కేటీఆర్ కాంగ్రెస్ సర్కారుపై (Congress Government) విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన.. పేదలకు అందించే పథకాలన్ని కట్ అయ్యాయని, కాంగ్రెస్ అంటే కటింగ్ (Cutting) అని వ్యంగ్యస్త్రాలు సంధించారు. కొండనాలికకు మందేస్తే ఉన్న నాలిక ఊడింది అన్నట్టుగా.. సన్నబియ్యం కోసం చూస్తే దొడ్డుబియ్యం కూడా ఇయ్యలేదని ఎద్దేవా చేశారు.
అలాగే రైతుల నుండి సన్నాలు కొన్నది లేదు.. సన్నాలకు బోనస్ రూ.500 ధర ఇచ్చింది లేదని దుయ్యబట్టారు. మార్చి నుండి పేదలకు సన్నబియ్యం అని ప్రకటనలు చేసి.. పదో తేదీ దాటినా పేదలకు రేషన్ బియ్యం కూడా ఇవ్వని అసమర్థ ప్రభుత్వమని ఫైర్ అయ్యారు. గురుకులాల్లో విద్యార్థులకు బుక్కెడు బువ్వ పెట్టని కాంగ్రెస్ సర్కార్.. సామాన్యులకు రేషన్ బియ్యం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తోందని సంచనలు ఆరోపణలు చేశారు. అంతేగాక లక్ష 54 వేల మెట్రిక్ టన్నులకు గాను రేషన్ దుకాణాలకు కేవలం 62 వేల మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేసి చేతులు దులుపుకున్న ఇందిరమ్మ ప్రభుత్వం అని మండిపడ్డారు.
కొత్త ఏడాది ఉగాదికి సన్నబియ్యం అని సన్నాయి నొక్కులు నొక్కి ఉన్న బియ్యం ఊడబీకిన కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ ప్రజాపాలన అంటే పస్తులేనా?, అని ఇందిరమ్మ రాజ్యం అంటే రేషన్ బియ్యం ఎగ్గొట్టుడేనా? అని ప్రశ్నాస్త్రాలు సంధిచారు. ఇక రైతులకు రుణమాఫీ కట్, రైతులకు రైతుభరోసా కట్, రైతులకు రైతుబీమా కట్, ఆడబిడ్డలకు కేసీఆర్ కిట్ కట్, గర్భవతులకు న్యూట్రిషన్ కిట్ కట్, విద్యార్థినులకు హెల్త్ కిట్, ఎలక్ట్రిక్ స్కూటీ కట్, మహిళలకు నెలకు రూ.2500 మహాలక్ష్మి కట్, ఆఖరికి పేదలకు రేషన్ బియ్యం కట్ అని కాంగ్రెస్ అంటే కటింగ్.. కాంగ్రెస్ అంటే కన్నింగ్ అని కేటీఆర్ ఫైర్ అయ్యారు.