ప్రతిభకు అంగ వైకల్యం అడ్డు కాదు : తమిళి సై
ప్రతిభకు అంగవైకల్యం అడ్డుకాదని, ఎంతోమంది ఆ విషయాన్ని నిరూపించారని గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ అన్నారు.
దిశ, శేరిలింగంపల్లి : ప్రతిభకు అంగవైకల్యం అడ్డుకాదని, ఎంతోమంది ఆ విషయాన్ని నిరూపించారని గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ అన్నారు. నవోదయ విద్యాలయ సమితి, ఆదిత్య మెహతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గచ్చిబౌలి డివిజన్ నలగండ్ల నవోదయ స్కూల్‌లో నిర్వహించిన నేషనల్ టాలెంట్ హంట్ అండ్ ట్రేనింగ్ క్యాంప్ 2023, పారా స్పోర్ట్స్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పారా అథ్లెట్లకు ప్రభుత్వాలు మంచి ప్రోత్సాహం అందిస్తున్నాయన్నారు. గత పారాఒలింపిక్స్‌లో మన దేశానికి 19 పతకాలు సాధించడం గర్వకారణమన్నారు.
పారా ఆథ్లెట్లకు మంచి ప్రతిభ ఉందన్నారు. వారి ప్రతిభను గుర్తించి వారికి సహకారం అందిస్తే ఉన్నత శిఖరాలకు ఎదగడమే కాదు దేశానికి మంచి పేరు తెస్తారన్నారు. ఈ సందర్భంగా పారా అథ్లెట్ల తల్లిదండ్రులను వారికి సహకరిస్తున్న వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నానని అన్నారు. ఎంతో ఓపికతో వారిని ప్రోత్సహిస్తూ, వారి బాగోగులు చూసుకుంటున్న వారికి కృతజ్ఞతలు తెలిపారు. అంగవైకల్యం ఉందని బాధపడకుండా ముందుకు సాగితే ఎన్నో విజయాలు సాధించవచ్చని అన్నారు. అలాగే పారా అథ్లెట్లను ప్రోత్సహిస్తున్న ఆదిత్య మెహతా ఫౌండేషన్ వారిని కూడా అభినందించారు. అనంతరం పారా అథ్లెట్లకు మెడల్స్‌ను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య మెహతా ఫౌండేషన్ ట్రస్ట్రీ శిల్పారెడ్డి, నవోదయ విద్యాలయ సమితి కమిషనర్ వినాయక్ గాంధీ పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, పారా అథ్లెట్లు, విద్యార్థులు పాల్గొన్నారు.