‘వాడు నచ్చాడా కేటీఆర్ నీకు.. నేను నచ్చలేదా: మంత్రిపై దర్శకుడు నర్సింగరావు సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ సీనియర్ దర్శకుడు బి. నర్సింగరావు మంత్రి కేటీఆర్‌పై విరుచుకుపడ్డారు.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ సీనియర్ దర్శకుడు బి. నర్సింగరావు మంత్రి కేటీఆర్‌పై విరుచుకుపడ్డారు. కలిసేందుకు 40 రోజుల నుండి అపాయింట్మెంట్ అడుగుతున్నా ఇవ్వావా అని మంత్రిపై ఆయన సీరియస్ అయ్యారు. ఇక బహిరంగగానే మాట్లాడుకుందామంటూ మంత్రికి సవాల్ విసురుతూ సోషల్ మీడియాలో ఓ లేఖ పోస్ట్ చేశారు. ‘వాడు నచ్చాడా కేటీఆర్ నీకు.. నేను నచ్చలేదా.. ఏ రకంగా నిన్ను అంచనా వేయవచ్చు’ అని విమర్శలు కేటీఆర్‌పై విమర్శలు కురిపించారు.
40 రోజుల నుండి, ప్రతి రెండు రోజులకు ఒకసారి నిన్ను అపాయింట్మెంట్ అడిగితే.. నువ్వు నాకు అపాయింట్మెంట్ ఇవ్వవా..? నీ రెండు లక్షల కోట్ల అభివృద్ధి నాకు రెండు చిల్లి గవ్వలు కూడా కావని కేటీఆర్‌పై ధ్వజమెత్తారు. రాజ్యం ఏలడమే కాదు, రాజ్యంలో ఎవరు, ఏమిటి అన్న విజ్ఞత కూడా ఉండాలి. అత్యంత ఉన్నత వ్యక్తులను అత్యంత హీనంగా అణిచివేయడం ఎంత నీచమో ఒకసారి ఆలోచించు.. అని కేటీఆర్‌కు సూచించారు. అంత గొప్ప హీనులు నీ సలహాదారులు అంటూ మంత్రి సిబ్బందిపై ఫైర్ అయ్యారు.
‘‘అంత గొప్ప ఏలిక నీది. ఏ సంస్కృతి నుండి వెలసిన కమలాలు మీరు. మీ గత జాడల (అడుగుల) ఆనవాళ్ళు ఏమిటి..? ఇవన్నీ రేపు రేపు బహిరంగంగా మాట్లాడుకుందాం’’ అంటూ డైరెక్టర్ నర్సింగరావు సోషల్ మీడియాలో ఓ లేఖ పోస్ట్ చేశారు. దీంతో ఈ లేఖ తెలంగాణ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. దర్శకుడు నర్సింగరావు మంత్రి కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు చేయడానికి కారణం ఏంటని అని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇక, మా భూమి, దాసి, రంగులకల సినిమాలతో మంచి గుర్తింపు పొందిన దర్శకుడు నర్సింగరావు.. ఈ సినిమాలతో దశాబ్దాల క్రితమే తెలంగాణ సినిమాకు మంచి గుర్తింపు తీసుకువచ్చారు.