ప్రమాణ స్వీకారంపై టీ-బీజేపీలో భిన్నాభిప్రాయాలు.. హై కమాండ్ కీలక నిర్ణయం..!

ప్రమాణ స్వీకారంపై బీజేపీ ఎమ్మెల్యేల మధ్య భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శనివారం ఉదయం బీజేపీ స్టేట్ ఆఫీసులో పార్టీ చీఫ్ కిషన్ రెడ్డి అధ్యక్షతన

Update: 2023-12-09 17:19 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రమాణ స్వీకారంపై బీజేపీ ఎమ్మెల్యేల మధ్య భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శనివారం ఉదయం బీజేపీ స్టేట్ ఆఫీసులో పార్టీ చీఫ్ కిషన్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగిన అనంతరం రాజాసింగ్ అలిగి వెళ్లిపోయారు. పలువురు నేతలు ప్రమాణ స్వీకారం చేస్తామని చెప్పడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్టీ రాష్ట్ర నాయకత్వం తీరుపై అలిగిన రాజాసింగ్ తన మొబైల్‌ను స్విచ్చాఫ్ చేసుకొని పార్టీ నాయకులకు ఎవరికి అందుబాటులోకి రాలేదు. ఇది ఇప్పుడు బీజేపీలోనే కాదు ఇతర పార్టీల్లోనూ చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీలో ప్రొటెం స్పీకర్‌గా మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ను నియమించడాన్ని నిరసిస్తూ రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. అక్బరుద్దీన్ చేత ప్రమాణ స్వీకారం చేయరాదని, దీనికి దూరంగా ఉండాలని ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ నిర్ణయించారు.

తనతో పాటు తమ పార్టీ ఎమ్మెల్యేలు కూడా దీనికి దూరంగా ఉంటారని ఆయన శుక్రవారం మీడియాకు ప్రకటించారు. అయితే శనివారం ఉదయం జరిగిన ఎల్పీ మీటింగ్‌లో రాజాసింగ్ తీరును కొందరు ఎమ్మెల్యేలు తప్పు పట్టినట్లు తెల్సింది. తమతో చర్చించకుండా ఈ నిర్ణయాన్ని ఎలా తీసుకుంటావని రాజాసింగ్‌ను కొందరు ఎమ్మెల్యేలు ప్రశ్నించినట్లు సమాచారం. రాజాసింగ్ అభిప్రాయంతో కొందరు ఎమ్మెల్యేలు విబేధించి.. అసెంబ్లీ అలా బహిష్కరించవద్దని, ప్రమాణ స్వీకారం చేయాల్సిందేనని కొందరు ఎమ్మెల్యేలు కిషన్ రెడ్డి ముందు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ పరిణామాలతో నొచ్చుకున్న రాజాసింగ్ ఆగ్రహంగా సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు.

ఈ పరిణామాలన్నింటిని కిషన్ రెడ్డి వెంటనే ఢిల్లీ పెద్దలకు వివరించారు. చివరకు హైకమాండ్ కూడా రాజాసింగ్ అభిప్రాయంతో ఏకీభవించి అసెంబ్లీని బహిష్కరించాలని రాష్ట్ర పార్టీని ఆదేశించింది. ఇదే విషయాన్ని కిషన్ రెడ్డి మిగితా ఏడుగురు ఎమ్మెల్యేలతో కలిసి మీడియాకు వివరించారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ప్రోగ్రామ్‌ను బీజేపీ బహిష్కరించిందని, ప్రొటెం స్పీకర్ నియామకంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని కూడా కిషన్ రెడ్డి ప్రకటించారు. అయితే ఇదే విషయాన్ని రాజాసింగ్‌కు చెప్పేందుకు కిషన్ రెడ్డితో పాటు పార్టీ ఇతర నేతలు ఆయన మొబైల్‌కు ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ అని రావడంతో ఏడుగురు ఎమ్మెల్యేలే రాజ్ భవన్‌కు వెళ్లిన విషయం తెలిసిందే.


Similar News