పతకాలు సాధించిన పోలీసులకు నగదు పురస్కారాలు
ఆలిండియా పోలీస్ మీట్ లో వేర్వేరు క్రీడల్లో పతకాలు సాధించిన 33 మంది పోలీసు అధికారులకు డీజీపీ అంజనీకుమార్ శనివారం తన కార్యాలయంలో నగదు ప్రోత్సాహక బహుమతులు అందచేశారు.
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: ఆలిండియా పోలీస్ మీట్ లో వేర్వేరు క్రీడల్లో పతకాలు సాధించిన 33 మంది పోలీసు అధికారులకు డీజీపీ అంజనీకుమార్ శనివారం తన కార్యాలయంలో నగదు ప్రోత్సాహక బహుమతులు అందచేశారు. 2018 నుంచి 2023 వరకు దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహించిన ఆలిండియా పోలీస్ స్పోర్ట్స్, బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్, వాటర్ స్పోర్ట్స్, వాలీబాల్, సెపక్ తాప్రా, రెజ్లింగ్, క్రైం ఇన్వెస్టిగేషన్ తదితర విభాగాల్లో పతకాలు సాధించిన సిబ్బందికి వీటిని అందించారు. కార్యక్రమంలో అదనపు డీజీలు అభిలాష బిస్త్, షికా గోయల్, మహేశ్ భగవత్, సౌమ్యా మిశ్రా, ఐజీ షానవాజ్ ఖాసీంతోపాటు పలువురు పాల్గొన్నారు.
బంగారు పతకం గెలిచిన వారికి 3లక్షలు, వెండి పతకం సాధించిన వారికి 2లక్షలు, కాంస్య పతకం సాధించిన వారికి లక్ష రూపాయల చెక్కులను డీజీపీ అందించారు. నగదు పురస్కారం పొందిన వారిలో డీసీపీ శ్రీబాలాదేవి, ఏసీపీ టీ.లక్ష్మి, ఆర్ఐలు పవనరామ కుమార్, మన్మోహన్, ఎస్సైలు వెంకటేశ్, రమేశ్, తిరుపతి, ప్రణీత తదితరులు ఉన్నారు. ఇక నేరపరిశోధన, ఫింగర్ ప్రింట్ విశేష ప్రతిభ కనబరిచిన ఏడుగురు పోలీసు అధికారులకు డీజీపీ అంజనీకుమార ప్రశాంస పత్రాలను అందచేశారు.