ప్ర‌భుత్వంపై బీఆర్ఎస్ కుట్ర‌లు : డిప్యూటీ సీఎం

బీఆర్ఎస్ నేతలు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసిన సంక్షేమ పథకాలు బారాబర్ అమలు చేస్తామ‌ని డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క అన్నారు.

Update: 2025-01-05 13:17 GMT

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో/ గీసుగొండ : బీఆర్ఎస్ నేతలు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసిన సంక్షేమ పథకాలు బారాబర్ అమలు చేస్తామ‌ని డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క అన్నారు. ఇది ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం కట్టుబడి ఉంది పాలకుల కోసం కాదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వదు, ఐదు ఎకరాల కే పరిమితం చేస్తుంది అని బీఆర్ఎస్ నేతలు ఏది పడితే అది ప్రచారం చేశారన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారి మీడియా సంస్థల్లో, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశార‌ని అన్నారు. 10 సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ నేతలు ఒక్క హామీ పూర్తి చేయలేద‌ని ఎద్దేవా చేశారు. డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క్ ఆదివారం వ‌రంగ‌ల్ జిల్లా సంగెం మండ‌లం విశ్వ‌నాథ‌పురంలో రూ.8కోట్ల‌తో మూడు స‌బ్ స్టేష‌న్ ప‌నుల‌కు శంకు స్థాప‌న నిర్వ‌హించారు. అనంత‌రం గీసుకొండ మండలం 15వ డివిజన్ మొగిలిచర్ల లో నిర్వహించిన బహిరంగ స‌భ‌లో ఉప ముఖ్య‌మంత్రి మాట్లాడుతూ… బీఆర్ ఎస్ పై ధ్వ‌జ‌మెత్తారు. మేము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 50,000 ఉద్యోగాలు భర్తీ చేశామ‌ని అన్నారు.

గ్రూప్ వన్ పరీక్షను విజయవంతంగా నిర్వహించాము..రాష్ట్రంలో మహిళలు ఏ మూల నుంచి ఏ మూలకైనా ప్రయాణం చేసేందుకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించాము...రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య పరిమితిని ఐదు లక్షల నుంచి 10 లక్షలకు పెంచాం. 500 కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల లోపు వినియోగించే పేదలకు ఉచితంగా విద్యుత్, పంటల బీమా, రైతు బీమా అమలు చేస్తున్నామంటూ పేర్కొన్నారు. అలాగే సన్న ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తూ.. చివరి గింజ వరకు కొనుగోలు చేశాం. పాత పథకాలకు కోత విధించకుండా కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ముందుకు పోతోంద‌ని అన్నారు. మేం అధికారంలోకి వస్తే ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం, రేషన్ కార్డులు, రుణమాఫీ చేస్తామని ఎన్నికల ముందు ప్రకటించాము .. ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలు నెరవేర్చుకుంటూ పోతున్నామ‌ని అన్నారు.

కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు త‌లెత్తుకోండి..

కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సగర్వంగా తలెత్తుకొని గ్రామాల్లో ప్రచారం చేయాలంటూ భ‌ట్టి పిలుపునిచ్చారు. ఇందిరమ్మ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను సంక్రాంతి సంబరాలతో పాటు విస్తృతంగా ప్రచారం చేయండి ప్రజల్లోకి తీసుకువెళ్లాల‌ని సూచించారు. పదేళ్లపాటు పాలించిన బీఆర్ఎస్ నేతలు మిగులు బడ్జెట్ లో కూడా రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేయలేకపోయార‌ని అన్నారు. మేము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే రూ. 2 లక్షల లోపు రుణమాఫీ చేశాం. దాదాపు 22 వేల కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేశామ‌న్నారు. ఆధార్ కార్డులో, బ్యాంకు పుస్తకంలో తప్పులు దొర్లి రుణమాఫీ కాకపోతే ఇంటింటికి సర్వే చేసి వారికి కూడా రూ. 2 లక్షల లోపు రైతు రుణమాఫీ చేశామ‌న్నారు. బీఆర్ఎస్ నేతలు ఎన్ని కుట్రలు చేసినా, ఇబ్బందులు సృష్టించిన ఇందిరమ్మ ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడుతుంద‌న్నారు.

సంక్రాంతికి రైతు భరోసా

సంక్రాంతికి రైతు భరోసా ఇవ్వబోతున్నాము. ఏడాదికి 12,000 రైతుల ఖాతాలో జమ చేస్తామ‌ని భ‌ట్టి విక్ర‌మార్క్ స్ప‌ష్టం చేశారు. భూమిలేని నిరుపేద కూలీలు కూడా మా బిడ్డలే.. వారి బ్యాంకు ఖాతాల్లో ఏడాదికి 12,000 జమ చేస్తాం. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామ‌ని అన్నారు. బంగారు తెలంగాణ చేస్తామని 10 సంవత్సరాలు పాలించిన బిఆర్ఎస్ నేతలు ఇల్లు కూడా ఇవ్వలేదని నా పాదయాత్ర సమయంలో మీరంతా ఆవేదన వ్యక్తం చేశారు. మీ ఆవేదనను అర్థం చేసుకొని ఇందిరమ్మ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో 3500 ఇల్లు నిర్మించబోతుంది. ఇంటికి ఐదు లక్షల రూపాయల పెట్టుబడింది ప్రభుత్వం అందిస్తుంద‌న్నారు. ఈ ఏడాది 5వేల కోట్లతో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచితంగా కరెంటు సరఫరా చేస్తున్నామ‌ని అన్నారు.


Similar News