ఇది కేవలం తెలంగాణ డిమాండ్ మాత్రమే కాదు.. డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు
సచివాలయం వేదికగా కేంద్ర ఆర్థిక సంఘం చైర్మన్‌తో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం, తుమ్మల, ఉత్తమ్ భేటీ అయ్యారు.
దిశ, వెబ్‌డెస్క్: సచివాలయం వేదికగా కేంద్ర ఆర్థిక సంఘం చైర్మన్‌తో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం, తుమ్మల, ఉత్తమ్ భేటీ అయ్యారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. పన్నుల నుంచి మాకు వచ్చే ఆదాయం వాటాను 41% నుంచి 50% పెంచాలని కోరారు. రైతు భరోసా, రైతు రుణమాఫీ రాష్ట్రానికి జీవరేఖ లాంటివి.. ప్రజలకు ఆర్థిక భరోసా, అధిక భద్రతను కల్పిస్తాయని తెలిపారు.
కేంద్ర పథకాలను వినియోగించుకోవాలంటే తరచూ కఠినమైన నిబంధనలు విధిస్తున్నారు. ఫలితంగా కేంద్ర పథకాలను పొందడంలో రాష్ట్రాలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. రాష్ట్రాలు తమ అవసరాలు అనుగుణంగా కేంద్ర పథకాలను రూపొందించడానికి స్వయం ప్రతిపత్తిని అందించాలనికోరారు. సంక్షేమ కార్యక్రమాలను బలోపేతం చేయడం మౌలిక సదుపాయాల కల్పన ద్వారా అంతరాలను పరిష్కరించడానికి అవకాశం ఉంది. ఇది తెలంగాణ డిమాండ్ కాదు అన్ని రాష్ట్రాలకు సంబంధించినదని తెలిపారు.