ఫలించిన మంత్రుల చర్చలు.. తెలంగాణకు భారీగా పెట్టుబడులు

తెలంగాణకు పెట్టబుడులు తేవడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీశాఖ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో బృందం అమెరికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.

Update: 2024-06-08 10:48 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణకు పెట్టబుడులు తేవడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీశాఖ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో బృందం అమెరికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం అట్లాంటాలోని డెల్టా ఎయిర్ లైన్స్ కార్యాలయంలో ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ అండ్ సీటీఓ నారాయణన్ కృష్ణకుమార్‌తో రాష్ట్ర బృందం సమావేశమైంది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని.. ప్రభుత్వం అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పిస్తుందని శ్రీధర్ బాబు కంపెనీ ప్రతినిధులకు వివరించారు. ఏవియేషన్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు హైదరాబాద్ గమ్యస్థానంగా మారిందని చెప్పారు. మంత్రి శ్రీధర్ బాబు ప్రజెంటేషన్‌పై కృష్ణకుమార్ మరియు డెల్టా టీం సంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలిపారు.

అనంతరం మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ నుంచి అట్లాంటాకు నేరుగా విమానం నడపాలని కృష్ణకుమార్‌ను కోరారు. నేరుగా విమానాలు లేకపోవడం వలన అమెరికాలో విద్యాభ్యాసం కోసం వచ్చే విద్యార్థులు, ఇతర ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మంత్రి కోరారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అభ్యర్థన పట్ల కూడా డెల్టా ఎయిర్ లైన్స్ యాజమాన్యం సానుకూలంగా స్పందించింది. హైదరాబాద్‌కు నేరుగా విమానాలు నడిపేందుకు తక్షణం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. డెల్టా ఎయిర్ లైన్స్ ప్రతినిధుల స్పందన పట్ల ఇరువురు మంత్రులు ఆనందం వ్యక్తం చేశారు. మంత్రులతో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్, పెట్టుబడుల శాఖ స్పెషల్ సెక్రెటరీ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి తోపాటు ఇతర బృందం పాల్గొన్నారు.


Similar News