Rajnath Singh: మ్యాన్ పవర్ కాదు.. యుద్ధ సమయంలో అదే కీలకం

దేశ భద్రత విషయంలో రాజకీయాలు చేయడం సరికాదని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నొక్కిచెప్పారు.

Update: 2024-10-15 16:28 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: దేశ భద్రత విషయంలో రాజకీయాలు చేయడం సరికాదని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నొక్కిచెప్పారు. దేశ సమగ్రత, రక్షణ, సార్వభౌమత్వం విషయంలో కులాలు, మతాలు, ప్రాంతాలు, సిద్ధాంతలకు అతీతంగా ఐక్యంగా ఉండి సహకారమందించాలని కోరారు. వికారాబాద్ జిల్లా దామగుండం సమీపంలో భారత నేవీ ఆధ్వర్యంలో వెరీ లో ఫ్రీక్వెన్సీ (వీఎల్ఎఫ్) రాడార్ స్టేషన్‌కు మంగళవారం శంకుస్థాపన చేసిన సందర్భంగా రక్షణ మంత్రి మాట్లాడుతూ, ఈ కేంద్రం ద్వారా భారత మిలిటరీ సామర్థ్యం విస్తరిస్తుందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నెలకొల్పుతున్న వీఎల్ఎఫ్ స్టేషన్‌ను కేవలం మిలిటరీ కోణంలోనే చూడడంలేదని, జాతీయ అవసరాల ప్రాధాన్యతలో ఇదొక వ్యూహాత్మక అంశంగా పరిగణిస్తున్నట్లు స్పష్టం చేశారు. మారుతున్న సామాజిక పరిస్థితుల్లో యుద్ధరంగంలో సైనికులు, యంత్రాల మధ్య సమర్ధవంతమైన సమన్వయం చాలా ముఖ్యమైన అంశమన్నారు. వీఎల్ఎఫ్ స్టేషన్ ద్వారా ఇండియన్ సముద్ర రీజియన్‌లో భారత్ సాధికారత పెరుగుతుందని, మారిటైమ్ ప్రయోజనాలు నెరవేరుతాయన్నారు.

స్పష్టమైన విజన్‌తోనే ఈ కేంద్రాన్ని ఇక్కడ నెలకొల్పుతున్నామని, ప్రస్తుతం తమిళనాడులోని తిరునల్వేలి సమీపంలోని కట్టబొమ్మన్ ప్రాంతంలో పనిచేస్తున్న మొదటి వీఎల్ఎఫ్ కేంద్రానికి ఇది తోడవుతుందని రాజ్‌నాధ్ సింగ్ వ్యాఖ్యానించారు. యుద్ధంలో విజయం, అపజయం నిర్ధారణలో సాయుధ దళాలకు, షిప్‌లకు, సబ్‌మెరైన్‌లకు మధ్య ఉండే రియల్ టైమ్ కమ్యూనికేషన్ చాలా నిర్ణయాత్మకమైనదని అన్నారు. ఇది లేకపోతే ఎంతటి మ్యాన్ పవర్ ఉన్నా, యంత్రసామగ్రి ఉన్నా పైచేయి సాధించడం కష్టసాధ్యమన్నారు. ఇలాంటి ఆధునిక పరిజ్ఞానం, వీఎల్ఎఫ్ స్టేషన్ నుంచి ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అందే ఆదేశాలు, సమాచారం సకాలంలో సమర్ధవంతమైన నిర్ణయాన్ని తీసుకోడానికి దోహదపడుతుందన్నారు. యుద్ధక్షేత్రంలో ఉండే సైనికులకు వెంటవెంటనే ఆదేశాలు ఇవ్వడం, స్థానిక పరిస్థితులను వారి నుంచి తెలుసుకోడానికి వీఎల్ఎఫ్ స్టేషన్ మధ్యవర్తిగా పనిచేస్తుందన్నారు. సరైన సమయంలో సైనికులకు ఆదేశాలు అందితే వారి పోరాటపటిమ, ఆత్మస్థయిర్యాన్ని పెరుగుతుందన్నారు.

ఆధునిక టెక్నాలజీ వినియోగంలోకి వచ్చిన తర్వాత సంప్రదాయ యుద్ధ పద్ధతుల్లో మార్పు వచ్చిందని, ఇప్పుడు వీఎల్ఎఫ్ స్టేషన్ ద్వారా కమ్యూనికేషన్ పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా వెంటనే స్పందించడానికి వీలవుతుందని రాజ్‌నాధ్ సింగ్ పేర్కొన్నారు. చరిత్రలో అనేక యుద్ధాల్లో ఇది రుజువైందన్నారు. అందుకే గతం నుంచి నేర్చుకుని భవిష్యత్తులో మన భద్రత, పోరాడే సంపత్తిని సమకూర్చుకుంటున్నామన్నారు. ప్రపంచవ్యాప్తంగా సముద్రాలపై పట్టు పెంచుకోడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, అందులో మనం వెనకబడకుండా ఉండేందుకే ఇండియన్ ఓషన్ రీజియన్‌లో మనకు అనుకూలమైన పరిస్థితులను సృష్టించుకుంటున్నామని అన్నారు. మెరైన్, మారిటైమ్ రంగాలపై చాలా దేశాలు పట్టు సాధిస్తున్నాయని, ఇలాంటప్పుడు కేవలం ఇండియన్ ఓషన్ రీజియన్‌కు మాత్రమే పరిమితం కాకుండా భవిష్యత్తులో ఇండో-పసిఫిక్ ప్రాంతానికి కూడా విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నామని నొక్కిచెప్పారు. మనకున్న సముద్ర ప్రాంతాల్లో స్ట్రాంగ్ ఫోర్స్ గా తయారుకావడానికి, తద్వారా దేశ భద్రతకకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.

భారత్ శాంతినే కోరుకుంటున్నదని, యుద్ధానికి కాలు దువ్వకూడదనే నియమానికి కట్టుబడి ఉన్నదని, అందువల్ల ఇప్పుడు నెలకొల్పుతున్న వీఎల్ఎఫ్ స్టేషన్ కూడా శాంతి స్థాపన ప్రయత్నాల్లో భాగమేనని రాజ్‌నాధ్ సింగ్ నొక్కిచెప్పారు. మరోవైపు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా పర్యావరణానికి ప్రమాదం ఏర్పడుతున్నదనే ఆందోళనలు వినిపిస్తున్నాయని, కానీ పర్యావరణానికి కేంద్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నదనే అంశాన్ని స్పష్టం చేశారు. ఈ కేంద్రం ద్వారా నిర్వాసితులవుతున్నవారికి తగిన ఉపాధి కల్పన ఉంటుందని, నిర్మాణం సమయంతో పాటు భవిష్యత్తులోనూ వారికి ఉద్యోగ అవకాశాలుంటాయన్నారు. పర్యావరణంపై వీఎల్ఎఫ్ స్టేషన్ ప్రతికూల ప్రభావం ఉండదన్నారు. ఈ స్టేషన్ కారణంగా పరిసర ప్రాంతాలు ఆర్థికంగా, మౌలిక సదుపాయాలపరంగా అభివృద్ధి చెందడానికి పుష్కలమైన అవకాశాలున్నాయన్నారు. నౌకాదళ చీఫ్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠి మాట్లాడుతూ, ఇండియన్ నేవీ కమ్యూనికేషన్ వ్యవస్థలో ఇక్కడ ఏర్పాటవుతున్న వీఎల్ఎఫ్ స్టేషన్ సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తుందన్నారు. నమ్మకమైన సమాచార వ్యవస్థ, కమాండ్ కంట్రోల్, కమ్యూనికేషన్ నెట్‌వర్క్ తో సముద్రాలపై షిప్‌లు, సబ్ మెరైన్‌లలో ఉన్న సైనికులతో సంభాషించడం, ఆదేశాలు జారీచేయడం, శత్రువులకు లీక్ కాకుండా వ్యవహరించడం సులవవుతుందన్నారు.


Similar News