Harish Rao : గురుకుల విద్యార్థుల మరణాలు ప్రభుత్వ హత్యలే : టి.హరీష్ రావు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గురుకులాల్లో జరిగిన విద్యార్థుల(Gurukul students) మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించి ఒక్కో విద్యార్థికి రూ.10లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని మాజీ మంత్రి టి. హరీష్ రావు(T. Harish Rao)డిమాండ్ చేశారు.
దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గురుకులాల్లో జరిగిన విద్యార్థుల(Gurukul students) మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించి ఒక్కో విద్యార్థికి రూ.10లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని మాజీ మంత్రి టి. హరీష్ రావు(T. Harish Rao)డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 11 నెలల్లో గురుకులాల్లో నెలకు ముగ్గురు విద్యార్థులు ఫుడ్ పాయిజన్, ఆత్మహత్యల కారణంగా ప్రాణాలు కోల్పోయారని, ఇప్పటిదాక 42మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని ఆయన ట్విటర్ వేదికగా వివరాలు వెల్లడించారు. తెలంగాణ గురుకులాల్లో ఫుడ్ పాయిజన్లు, ఆత్మహత్యలతో మరణ మృదంగం వినిపిస్తున్నాయన్నారు. గురుకుల విద్యార్థుల మరణాలు ప్రభుత్వ హత్యలేనని స్పష్టం చేశారు. గురుకులాల్లో విద్యార్థులు వరుసగా ప్రాణాలు కోల్పోతున్నా, ప్రభుత్వం మొద్దు నిద్ర వీడకపోవడం సిగ్గుచేటన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి, కానీ చేతలు మాత్రం గడప దాటడం లేదని విమర్శించారు. గురుకులాల భోజనంలో నాణ్యత లేకుంటే జైలుకే అని బాలల దినోత్సవం నాడు సీఎం ప్రగల్బాలు పలకడం తప్ప, ఎలాంటి కార్యచరణకు దిక్కులేదని మండిపడ్డారు. సంగారెడ్డి జిల్లా బీసీ బాలికల గురుకుల పాఠశాలలో నిన్న మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం కలచివేసిందని, ఎంతో భవిష్యత్తు కలిగిన విద్యార్థులు అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోతుంటే, వారిని కాపాడాల్సిన ప్రభుత్వం చోద్యం చూడడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చావులు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని, దీనికి సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
వాంకిడిలో గురుకులంలో పాఠాలు వినాల్సిన విద్యార్థిని గత 17 రోజులుగా నిమ్స్‌లో వెంటిలేటర్‌పై కొట్టుమిట్టాడుతున్నదని, ఇందుకు కారణం ఎవరని ప్రశ్నించారు. ఉన్నత స్థాయికి చేరుకొని తల్లిదండ్రుల కలను సాకారం చేయాలనుకున్న బాసరలో ట్రిపుల్ ఐటీవిద్యార్థిని బలవన్మరణానికి కారణం ఎవరని, సంగారెడ్డి బీసీ గురుకులంలో ఎంతో భవిష్యత్తు ఉన్న చిన్నారి ఆత్మహత్యకు కారణం ఎవరని, ఇలా చెప్పుకుంటూ పోతే, గురుకులాలలో గత 11 నెలల్లో సగటున నెలకు ముగ్గురు ప్రాణాలు కోల్పోతున్నారని, ఈ మరణాలకు కారణం ఎవరని ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రతిష్టాత్మకమైన బాసర ట్రిపుల్ ఐటీ లోనూ ఇదే దుస్థితి కొనసాగడం దురదృష్టకరమన్నారు. ఘనత వహించిన కాంగ్రెస్ పాలనలో ముగ్గురు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని, ఈ మరణాలకు కారణం ఎవరన్నారు. బీఆర్ఎష్ పాలనలో దేశానికి రోల్ మోడల్ గా నిలిచిన గురుకులాలు కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ నిర్లక్ష్యంతో రోజురోజుకి దిగజారిపోతుండడం బాధాకరమన్నారు.
విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే గురుకులాలు నరకకూపాలుగా మారాయని, విద్యాశాఖతో పాటు సంక్షేమ శాఖ, గిరిజన శాఖ, మైనార్టీ శాఖలు ముఖ్యమంత్రి నిర్వహణలో ఉండి కూడా జరుగుతున్న నిర్లక్ష్యం, అభం శుభం తెలియని విద్యార్థుల పాలిట శాపంగా మారిందన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి నిర్వహించే శాఖల పరిస్థితే ఇలా ఉంటే, ఇక మిగతా శాఖల పనితీరు గురించి చెప్పాల్సిన పనిలేదన్నారు. ఇంకెంతమంది చిన్నారులు ప్రాణాలు కోల్పోవాలి ముఖ్యమంత్రి గారు అంటూ ప్రశ్నించారు. ఇంకెప్పుడు మీ కార్యచరణ మొదలుపెట్టి విద్యార్థులను కాపాడుతారని నిలదీశారు. ఈ చావులకు ప్రభుత్వం బాధ్యత వహించి, చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని హరీష్ రావు పేర్కొన్నారు.