Bandi Sanjay: ‘రైతుల కడుపు కొడుతున్న కాంగ్రెస్ సర్కార్’
తెలంగాణ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని, ధాన్యం కొనుగోళ్లు సరిగా చేయకుండా నానా కష్టాలకు గురి చేస్తోందని కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని, ధాన్యం కొనుగోళ్లు సరిగా చేయకుండా నానా కష్టాలకు గురి చేస్తోందని కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. స్థానికంగా సాయి అనే కార్యకర్త వివాహ కార్యక్రమానికి హాజరైన బండి సంజయ్ అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. తెలంగాణలో కొనుగోళ్లు సరిగ్గా జరగకపోవడం వల్ల రైతులు నానా అవస్థలు పడుతున్నారని, అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ అనేక చోట్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదని, కేంద్రాలు ప్రారంభమైన ప్రాంతాల్లో కూడా అనేక చోట్ల ఇప్పటికీ కొనుగోళ్లు మొదలు కాలేదని, దీనివల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బండి సంజయ్ అన్నారు. వడ్లు తెచ్చి ఆరబోసుకున్న రైతులు.. తమ పంట అమ్ముడవుతుందో లేదోననే భయానక వాతావరణంలో జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
‘రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ధాన్యం టార్గెట్ 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడమే. ఇందులో నవంబర్ 15 వరకు 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. కానీ 17వ తేదీ వచ్చినా అందులో సగం ప్రొక్యూర్మెంట్ కూడా కాలేదు. దీంతో ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయిన రైతులు 25 శాతం ధాన్యాన్ని బ్రోకర్లకు తక్కువ ధరకు అమ్ముకున్నారు. ఇక కొనుగోళ్లు ప్రారంభమైన చోట కూడా తరుగు, తేమ, తాలు పేర్లు చెప్పి కటింగ్స్ చేస్తున్నారు. తెలంగాణలో రైతుల పరిస్థితి ఇంత దయనీయంగా ఉంది. ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం, అధికారంలోకి రాగానే కేవలం సన్నవడ్లకే బోనస్ ఇస్తామని మాట మార్చింది.
రాష్ట్రంలో 50 లక్షల మెట్రిక్ టన్నుల సన్నవడ్లున్నాయని, వీటికి బోనస్ ఇస్తామని వ్యవసాయ శాఖా మంత్రి స్వయంగా చెప్పారు. ఈ ధాన్యం పండించిన రైతులకు బోనస్ ఇచ్చేందుకుగానూ రూ.2500 కోట్ల రూపాయలు సిద్ధంగా ఉంచామని చెప్పారు. కానీ ఇప్పటికీ ఆ బోనస్ ఇవ్వలేదు. ధాన్యానికి రూ.2300 మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం ప్రకటించగా.. ఆ కనీసం మద్దతు ధర కూడా లేకుండా రైతులు దళారులకు రూ.1700, 1800కు అమ్ముకుంటూ తీవ్రంగా నష్టపోతున్నారు. రైతులు బ్రోకర్లకు ధాన్యాన్ని అమ్ముకుంటుంటే ప్రభుత్వం చూస్తూ కూర్చుంటోంది. దీనివల్ల వాళ్లకు ఇవ్వాల్సిన బోనస్ సొమ్మును నొక్కేయొచ్చని కుట్రపూరితంగా ఆలోచిస్తోంది. రైతుల కడుపు కొడుతోంది’ అంటూ బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు.
అనంతరం బీఆర్ఎస్ గురించి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ విధ్వంసకర పార్టీ అని, ప్రజల ప్రాణాలతో బీఆర్ఎస్ చెలగాటం ఆడుతోందని, దాడులతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోందని, తెలంగాణలో ఆ పార్టీని నిషేధించాలని అన్నారు.
Live : Addressing the Media from Sangareddy https://t.co/RHZYpkA586
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) November 17, 2024