హెర్షే చాక్లెట్ సిరప్ లో చనిపోయిన ఎలుక.. హడలిపోయిన కుటుంబం
చాక్లెట్ సిరప్ లో చనిపోయిన ఎలుక ప్రత్యక్షం కావడం ఓ కుటుంబాన్ని కలవరపాడుకు గురి చేసింది.
దిశ, డైనమిక్ బ్యూరో: ఇటీవల ఐస్ క్రీమ్ లో మనిషి వేలు, జెర్రీ వచ్చిన ఘటనలు ప్రజలను తీవ్రంగా కలకవరపాటుకు గురి చేశాయి. అయితే ఈ ఘటనలు మరువక ముందే హెర్షే చాక్లేట్ సిరప్ లో చనిపోయిన ఎలుక ప్రత్యక్షమైన ఘటన వైరల్ గా మారడం కలకలం రేపుతున్నది. ఈ సిరప్ ను కుటుంబంలోని చిన్నారులు తినగా అందులో ఒకరు ఆసుపత్రి పాలయ్యారు. దీంతో అసలేం జరిగిందో అని బాటిల్ చూడగా అందులో చచ్చిన ఎలుక దర్శనం ఇవ్వడం ఆ కుటుంబాన్ని ఆందోళనకు గురైంది. ప్రామి శ్రీధర్ అనే మహిళ తన ఇన్ స్టాగ్రామ్ లో ఈ విషయాన్ని పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ ప్రకారం. బ్రౌనీ కేక్ లో తినేందుకు తాము ఆన్ లైన్ గ్రాసరీ డెలివరీ యాప్ జెప్టోలో హెర్షే చాక్లెట్ సిరప్ బాటిల్ ఆర్డర్ చేశాం. అయితే బాటిల్ లో నుంచి సిరప్ ను బయటకు తీస్తున్నప్పుడు అందులో చిన్న వెంట్రుకలను గమనించాం. దాంతో బాటిల్ లో ఉన్న సిరప్ అంతా బయటకు తీసి చూస్తే అందులో నుంచి చనిపోయిన ఎలుక అవశేషం బయటపడింది.
అప్పటికే తమ కుటుంబంలోని ముగ్గురు పిల్లలు ఆ సిరప్ ను తిన్నారని అందులో ఒక బాలిక స్పృహ తప్పి పడిపోయిందని ఆమెను ఆసుపత్రిలో చేర్పించినట్లు తన పోస్టులో పేర్కొంది. అయితే ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపింది. ఇది నిజంగా ఆందోళనకరం, ఆమోదయోగ్యం కాదు. నాణ్యత ప్రమాణాల విషయంలో మేము ఆందోళన చెందుతున్నాం. దయచేసి మీరు ఏం ఆర్డర్ చేస్తున్నారో మీ పిల్లలకు ఏం తినిపిస్తున్నారో జాగ్రత్తగా ఉండండి అని పోస్టులో రాసుకొచ్చింది. అయితే ఈ ఘటనపై హెర్షే ఇండియా స్పందిస్తూ క్షమాపణలు కోరింది. ఇది చూసి మేము చింతిస్తున్నాం.. దయచేసి మాకు బాటిల్ పై ఉన్న యూపీసీ, తయారీ కోడ్ ను తెలపండి. మా టీమ్ మీకు హెల్ప్ చేస్తుంది అని బదులిచ్చింది. ఈ ఘటనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ ఘటన గత నెలలోనే జరిగినా తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.