బంజారాహిల్స్‌లో దారుణం.. వాచ్‌మెన్‌ను మూడో ఫ్లోర్ నుంచి తోసేసిన డాన్సర్లు

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ శ్రీనగర్ కాలనీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రాఘవ లాడ్జీ వద్ద మద్యం మత్తులో వాచ్‌మెన్‌తో నలుగురు డ్యాన్సర్లు గొడవ పడ్డారు.

Update: 2023-04-28 02:14 GMT

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: తాగి గొడవ చెయ్యొద్దన్న పాపానికి లాడ్జి వాచ్ మెన్‌ను భవనం పైనుంచి కిందకు తోసి చంపాడు ఓ డాన్సర్. కలకలం సృష్టించిన ఈ దారుణం గురువారం రాత్రి హైదరాబాద్ కృష్ణానగర్‌లో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్న ఓ సినిమా పాట షూటింగ్‌లో పాల్గొనేందుకు చెన్నై నుంచి పన్నెండు మంది డాన్సర్లు హైదరాబాద్ వచ్చారు. కృష్ణానగర్‌లోని రాఘవ లాడ్జిలో బస చేశారు. కాగా, గురువారం రాత్రి పొద్దుబోయాక అంతా కలిసి లాడ్జి టెర్రస్‌పై మద్యం సేవించారు.

మత్తులో అల్లరి చేస్తుండటంతో వాచ్ మెన్ యాదగిరి పైకి వెళ్లాడు. గొడవ చెయ్యొద్దంటూ నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు. దాంతో మత్తులో ఉన్న మణికంఠ అనే డాన్సర్ అతనిపై దాడి చేసి కొట్టాడు. మొబైల్ ఫోన్ లాక్కొని పగులగొట్టాడు. అంతటితో ఆగకుండా యాదగిరిని కొడుతూ మూడో అంతస్తులోకి లాక్కొచ్చి కిటికీ నుంచి కిందకు తోసివేశాడు. తీవ్రంగా గాయపడ్డ యాదగిరి ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. మణికంఠను అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News