Book My Show ప్రతినిధులకు సీపీ అవినాష్ మహంతి వార్నింగ్
'సన్ బర్న్' వేడుకల వ్యవహారంలో ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి అధికారులపై మండిపడ్డారు.
దిశ, డైనమిక్ బ్యూరో: 'సన్ బర్న్' వేడుకల వ్యవహారంలో ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి అధికారులపై మండిపడ్డారు. ప్రభుత్వ అనుమతి లేకుండా అలాంటి వేడుకలు ఎలా నిర్వహిస్తారని, బుక్ మై షో లాంటి కొన్నింటిని తాను స్వయంగా గమనించారని, వాళ్లు ప్రభుత్వ అనుమతి పొందలేదని సీఎం అధికారులపై ద్వజమెత్తారు. ఈ నేపథ్యంలోనే నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నగరంలో ‘సన్‌బర్న్’ పేరిట సబరాబాద్ పరిదిలో నిర్వహించ తలపెట్టిన ఈవెంట్‌పై దుమారం రేగడంతో సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి ఇవాళ స్పందించారు.
ఈవెంట్ నిర్వహణకు దరఖాస్తు చేసుకున్నారని, అయితే అనుమతి ఇవ్వలేదని వెల్లడించారు. మాదాపూర్‌లోని హైటెక్‌సిటీ సమీపంలో ఈ ఈవెంట్ ఏర్పాటు చేసేందుకు నిర్వాహకులు సిద్ధమైనట్లు తెలిపారు. ఇది ఇతర నగరాల్లో జరిగే సన్‌బర్న్‌లాంటి వేడుక కాదని, అందుకే అనుమతి నిరాకరించామని సీపీ పేర్కొన్నారు. కాగా, సైబరాబాద్ పోలీసు ఉన్నతాధికారులు సన్‌బర్న్ ఈవెంట్ నిర్వాహకుల్ని, బుక్ మై షో ప్రతినిధుల్ని పిలిపించుకొని గట్టిగా మందలించారని సమాచారం. హద్దు మీరితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు తెలుస్తోంది.