Cyber Crime Police: ఉత్తమ్ ఫిర్యాదుపైనే వార్ రూంపై దాడులు

యూత్ కాంగ్రెస్ వార్ రూం నిర్వాహకుడు ప్రశాంత్‌ను విచారణకు రావాల్సిందిగా సైబర్ క్రైం పోలీసులు నోటీసులు జారీ చేశారు...

Update: 2023-05-16 08:48 GMT

దిశ తెలంగాణ క్రైం బ్యూరో: యూత్ కాంగ్రెస్ వార్ రూం నిర్వాహకుడు ప్రశాంత్‌ను విచారణకు రావాల్సిందిగా సైబర్ క్రైం పోలీసులు నోటీసులు జారీ చేశారు. బంజారాహిల్స్ ప్రాంతంలోని యూత్ కాంగ్రెస్ వార్ రూంపై సైబర్ క్రైం పోలీసులు దాడి చేసిన విషయం తెలిసిందే. వచ్చిరాగానే వార్ రూంలో ఉన్న ఇద్దరి నుంచి సెల్ ఫోన్లు తీసేసుకున్నారు. అనంతరం నలుగురు అధికారుల బృందం దాదాపు గంటన్నరపాటు ఆఫీస్‌లో తనిఖీలు జరిపారు. కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు, కొన్ని ఫైల్స్ స్వాధీనం చేసుకున్నారు. ప్రశాంత్ అనే వ్యక్తి ఈ వార్ రూంను నిర్వహిస్తున్నట్టు విచారణలో గుర్తించారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదుపైనే..

ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదుపైనే సైబర్ పోలీసులు ఈ దాడులు జరుపటం జరిగింది. తనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈనెల 5న సైబర్ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. ఈ క్రమంలో విచారణ చేసిన సైబర్ పోలీసులు యూత్ కాంగ్రెస్ వార్ రూం నుంచే ఉత్తమ్ కుమార్ రెడ్డిపై దుష్ప్రచారం జరుగుతున్నట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే దాడులు చేసిన సైబర్ పోలీసులు విచారణకు రావాలని ప్రవీణ్‌కు నోటీసులు ఇచ్చారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంటికి ఈ వార్ రూం కూతవేటు దూరంలో ఉండటం గమనార్హం. 

Tags:    

Similar News