పిచ్చుకలపై బ్రహ్మాస్త్రమా? ఎలక్షన్ అధికారుల తీరుపై విమర్శల వెల్లువ

ఎన్నికల వేళ హైదరాబాద్ జిల్లా ఎన్నికల యంత్రాంగంపై రకరకాల విమర్శలు

Update: 2023-11-02 01:52 GMT

దిశ, సిటీ బ్యూరో: ఎన్నికల వేళ హైదరాబాద్ జిల్లా ఎన్నికల యంత్రాంగంపై రకరకాల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎలక్షన్ కోడ్‌ను పకడ్భందీగా అమలు చేయటంతో పాటు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలను పాటిస్తూ్ పారదర్శకంగా పని చేయాల్సిన అధికారులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో స్పెషల్ చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన పోలీసులు.. సాధారణ పౌరుల వద్ద భారీ మొత్తంలో నగదు పట్టుకుంటున్నారు. తనిఖీల్లో భాగంగా ఇదంతా జరుగుతున్నప్పటికీ.. తిరిగి ఆ డబ్బులు ప్రజల ఎలా పొందాలో చెప్పకపోవడం గమనార్హం. దీంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. దీనికి తోడు హైదరాబాద్ మహా నగరంలో వేల సంఖ్యలో నగల దుకాణాలున్నాయి. వీటిల్లోకి వెళ్లిన కస్టమర్లకు నగల డిజైన్లు నచ్చకుంటే షాపుల యజమానులు ఒక షాపు నుంచి మరో షాపుకి నగలు తెప్పించుకని విక్రయిస్తుంటారు. ఈ క్రమంలో ఒక దుకాణం నుంచి మరో దుకాణానికి తరలిస్తున్న వెండి, బంగారు నగలను సైతం పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. దీంతో షాపు యజమానులతో పాటు కస్టమర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఎన్నికల సంఘాల బృందాలు తమ కళ్ల ముందే అధికార పార్టీకి చెందిన అభ్యర్థులు తమ అనుచరులకు విచ్చలవిడిగా డబ్బు చేస్తున్నా కనీసం ప్రశ్నించకపోవడం దారుణం. ప్రగతి భవన్‌లో బీఆర్ఎస్ అభ్యర్థులకు బీ-ఫారాలతో పాటు పార్టీ ఫండ్ రూపంలో రూ.40లక్షలు అందజేసినట్లు వార్తలు వచ్చినా అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్యులను కోడ్ పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్న అధికారులు అధికార పార్టీకి మాత్రం వత్తాసు పలికేలా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి. అధికార పార్టీ అభ్యర్థులు నేటి వరకు నిర్వహించిన పాదయాత్రలు, ర్యాలీలు, కార్యకర్తలు గ్రూప్ మీటింగ్‌లు, డివిజన్ స్థాయి మీటింగ్‌లు మీటింగుల పేరుతో కోట్లు ఖర్చు చేస్తున్నా పట్టించుకునేవారే లేరని ప్రజలు వాపోతున్నారు. గ్రూప్ మీటింగ్‌లు నిర్వహిస్తూ భారీగా నగదు పంచుతున్నా, ఎన్నికల నిఘా విభాగానికి కన్పించటం లేదా? అని పౌరులు ప్రశ్నిస్తున్నారు.

ఇది కాదా? కోడ్ ఉల్లంఘన

జూబ్లీహిల్స్ అధికార బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ గత నెల 31న ఎర్రగడ్డ ప్రాంతంలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు పోలీసుల ముందే తల్వార్లతో విన్యాసాలు చేశారు. కానీ, అక్కడున్న పోలీసులు, అభ్యర్థి అడ్డుకోకపోవడం కోడ్ ఉల్లంఘన కాదా? అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. పోలీసులు, ఎలక్షన్ ఆఫీసర్ల తీరు చూస్తుంటే పిచ్చుకలపై బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తున్నట్టు ఉందని వాపోతున్నారు.


Similar News