పవన్ ఎంతవరకు కలిసి వస్తారో చూడాలి: సీపీఐ నారాయణ
కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించే రాష్ట్ర ప్రభుత్వాలు, పార్టీలు, వ్యక్తులపై కేంద్రం ఏకపక్ష దాడులు జరుపుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. బీజేపీ విధానాలను టీఆర్ఎస్ వ్యతిరేకిస్తోంది కాబట్టి ఆ పార్టీపై కేంద్రం దాడులు చేస్తోందని విమర్శించారు.
దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించే రాష్ట్ర ప్రభుత్వాలు, పార్టీలు, వ్యక్తులపై కేంద్రం ఏకపక్ష దాడులు జరుపుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. బీజేపీ విధానాలను టీఆర్ఎస్ వ్యతిరేకిస్తోంది కాబట్టి ఆ పార్టీపై కేంద్రం దాడులు చేస్తోందని విమర్శించారు. ఒకవేళ కేసీఆర్ మోడీ జై అంటే రాత్రికి రాత్రే కేసులన్నీ మాయమైపోతాయని తృణమూల్ కాంగ్రెస్‌లో శారద, నారద కేసుల్లో ఉన్నవాళ్లు బీజేపీలో చేరగానే ఇదే జరిగిందన్నారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన ఏపీలో వైసీపీ గెలిస్తే బీజేపీ గెలిచినట్టే అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే ఎక్కువ వైసీపీ నుంచి కేంద్ర ప్రభుత్వానికి మద్దతు లభిస్తుందని అన్నారు. టీడీపీని బలహీనపర్చడం కోసమే పవన్ కళ్యాణ్‌ను బీజేపీ తమవైపు లాగుతోందని మోడీకి మద్ధతిచ్చే వైసీపీకి వ్యతిరేకంగా అందరూ కలవాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఎంతవరకు కలిసివస్తారో చూడాలని చెప్పారు. జీ-20 కూటమికి భారత నాయకత్వం వహించడం సీపీఐ కూడా స్వాగతిస్తుందని అయితే మహిళా బిల్లు ఆమోదించకుండా జీ-20 లో మహిళా సాధికారతపై ఏం చర్చిస్తారని ప్రశ్నించారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే మహిళా బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేశారు. మహిళా బిల్లు ఆమోదానికి సీపీఐ పూర్తిగా సహకరిస్తుందన్నారు. అలాగే జీ-20 లోగో లో కమలం పువ్వు గుర్తు పెట్టడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది బీజేపీ సంకుచిత స్వభావానికి నిదర్శనం అన్నారు. దీన్ని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.