జూ.ఎన్టీఆర్‌కు ఏం ఖర్మ పట్టిందని అమిత్‌షాను కలిశారు?
దిశ, డైనమిక్ బ్యూరో: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జూ.ఎన్టీఆర్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడాన్ని ఆయన తప్పు పట్టారు. జూ.ఎన్టీఆర్ తాత, తండ్రి మంచివారని నీకు ఏంఖర్మ పట్టిందని అమిత్ షాను కలిశావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ గుజరాత్ సీఎం గా ఉన్న సమయంలో అమిత్‌షా ఓ స్మగ్లర్ అని ఆరోపించారు. క్రిమినల్ అయిన అమిత్‌షా వద్దకు జూ.ఎన్టీఆర్ ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. బీజేపీ సినిమా యాక్టర్ల కాళ్లు పట్టుకునే ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు.
కేసీఆర్ జగన్‌ను ఒప్పించాలి..
జాతీయ రాజకీయాల్లో బీజేపీని నిలువరించే ప్రయత్నాలు చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నారాయణ కితాబిచ్చారు. కేసీఆర్ బిహార్ వెళ్లి సీఎం నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, ఆర్ జేడీ నేత లాలు ప్రసాద్ యాదవ్‌లతో భేటీ కావడాన్ని స్వాగతించారు. బీజేపీ వ్యతిరేక కూటమిని కలిసినందుకు కేసీఆర్‌ను అభినందిస్తున్నానని ఇది ముఖ్యమైన పరిణామం అన్నారు. అలాగే కేసీఆర్ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కూడా కలిసి బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు ఒప్పించాలన్నారు.
బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడనే కేసీఆర్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థలు టార్గెట్ చేస్తున్నాయని ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుల విషయంలో దర్యాప్తు సంస్థలు కొండను తవ్వి ఎలుకను పట్టుకున్నారని ఎద్దేవా చేశారు. ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ధనవంతుల జాబితాలో చేరిన అదానీపై నారాయణ విమర్శలు గుప్పించారు. గుజరాత్ వాళ్ళు దేశాన్ని దోచుకుంటున్నారని.. పనికి మాలిన పనులు చేస్తేనే తొందరగా కుబేరులుగా మారుతున్నారని ఆరోపించారు.