రాజకీయ ఎజెండాతోనే ప్రభుత్వంపై ప్రతిపక్షాల దాడి : సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని కీలక వ్యాఖ్యలు

మూసీ ప్రక్షాళన, హైడ్రా సహా రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఉద్యోగాలు తదితర సమస్యలపై బీజేపీ, బీఆర్ఎస్ లు ప్రజాప్రయోజనాల కంటే రాజకీయ ఎజెండాతోనే ప్రభుత్వంపై విమర్శల దాడి చేస్తున్నాయని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-10-20 12:33 GMT

దిశ, వెబ్ డెస్క్ : మూసీ ప్రక్షాళన, హైడ్రా సహా రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఉద్యోగాలు తదితర సమస్యలపై బీజేపీ, బీఆర్ఎస్ లు ప్రజాప్రయోజనాల కంటే రాజకీయ ఎజెండాతోనే ప్రభుత్వంపై విమర్శల దాడి చేస్తున్నాయని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎటు చూసినా ఇబ్బంది వాతావరణం కనిపిస్తుందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఇద్దరికీ ఒక్కటే ఎజెండా ఉందని, వారి ఆస్తులు పరిరక్షించుకోవడం కోసం పెద్ద ఎత్తున రభస చేస్తున్నారని, రాబందుల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. హైడ్రా, మూసీ ప్రక్షాళన ప్రాజెక్టుల వల్ల పేద వారికి నష్టం జరగవద్దని, పెద్ద వాడి గుండెలు అదరాలన్నారు. ఆక్రమణదారులపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చెయ్యాలని, అందులో మాఫియా చేసే వారి లెక్క తీయాలన్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీ వారు ఉంటే వారి లెక్క కూడా తీయాలన్నారు. దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా బీఆర్ఎస్ పని తీరు ఉందన్నారు. ప్రజలు అశీర్వదించిన ప్రభుత్వంను ఇబ్బంది పెట్టాలని కొన్ని పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు.

హైడ్రా పేద వాళ్ళ జోలికి వెళ్ళడం లేదన్నారు. పేదవారి భుజం మీద తుపాకీ పెట్టి.. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎంలు కాంగ్రెస్ ప్రభుత్వంను టార్గెట్ చేస్తున్నాయని మండిపడ్డారు. పేద వాళ్లకు రక్షకులుగా ఆ పార్టీల నాయకులు కలరింగ్ ఇస్తున్నారని, నిజానికి పెద్ద వారిని రక్షించాలనే ఆందోళనలతో మూసీ, హైడ్రా సమస్యలను డైవర్ట్ చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ ట్రాప్ లో బీఆర్ఎస్ పడుతుందన్నారు. ప్రభుత్వం లక్ష్యం గురి తప్పుతుందన్నారు. తాము కాంగ్రెస్ కు మిత్ర పక్షంగా ఉన్నామని, అదే సమయంలో పేద వాళ్లకు అండగా ఉంటామన్నారు. ప్రభుత్వంకు హడావిడి గా చేయాల్సిన అవసరం లేదని, తొందరపడితే నిజమైన ఆక్రమణదారులు తప్పించుకుంటారన్నారు.

హైడ్రా మంచికి ఉపయోగిస్తే, మేము మద్దతునిస్తామన్నారు. మూసీ నీళ్ళతో పంటలు పండుతాయని, కానీ అవి తినే పరిస్థితి లేదని నల్గొండ వాసులు చెప్తున్నారన్నారు. ఈ సమస్యపై అన్ని రంగాల ప్రముఖులు స్పందించాలన్నారు. పేదవారి ఇళ్లు కూల్చాలని నిర్ణయం తీసుకుంటే, వారికి ప్రత్యమ్నాయం చూపాలన్నారు. భూములు కొనుక్కున్న వారికి ఖాళీ చేయించాలని పరిస్థితి వస్తే.. వారు అప్పటి వరకు ఖర్చు పెట్టిన దాని కంటే మంచి ప్యాకేజీ ఇవ్వాలని కోరారు. భూ కబ్జా వారు ఎంత మంది ఉన్నారని గుర్తించాలన్నారు. రైతు రుణమాఫీని పూర్తిగా ప్రభుత్వం అమలు చేయాలని, రైతు భరోసాను తర్వాతైనా బకాయిలుగా చెల్లించాలని కోరారు. బీసీ కులగణన చేయాల్సిందేనని, ఎస్సీ వర్గాల లెక్క కూడా సేకరించాలని సూచించారు. నిరుద్యోగుల సమస్యలపై మాట్లాడే నైతిక అర్హత బీఆర్ఎస్ కు లేదన్నారు.


Similar News