ఓట్ల కోసం మోడీ ‘‘జై భజరంగ భలి’’ అనడం రాజ్యాంగ విరుద్ధం: నారాయణ

ప్రధాని నరేంద్రమోడీ ‘‘జై భజరంగ్‌ భలి’’ అంటూ ఓట్లు వేయాలని మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇది రాజ్యాంగ

Update: 2023-05-08 17:24 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రధాని నరేంద్రమోడీ ‘‘జై భజరంగ్‌ భలి’’ అంటూ ఓట్లు వేయాలని మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇది రాజ్యాంగ విరుద్ధమని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ‘ఇంటింటికీ సీపీఐ’ పాదయాత్రలో తమ దృష్టికి వచ్చిన ప్రజా సమస్యలను క్రోడీకరించి, వాటి పరిష్కారానికి భవిష్యత్‌ పోరాటాలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో సీట్ల సర్ధుబాటు అంశంలో రకరకాల పుకార్లను, ప్రచారాన్ని నమ్మ వద్దని, ముందు స్థానిక సమస్యల పరిష్కారానికి దృష్టి కేంద్రీకరించాలని సూచించారు.

సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాలు హైదరాబాద్‌ మగ్ధుం భవన్‌‌లో సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోనికి వస్తే ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని తెలంగాణ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి అమిత్‌ ప్రకటించడంపట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులు కంటే ముస్లింలు వెనుకబడి ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్లు నివేదిక ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అభివృద్ధి చెందిన అనేక దేశాలుఈవీఎంలను పక్కన బెట్టి, బ్యాలెట్‌ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌‌లో అన్ని రాజకీయ పార్టీలు బీజేపీకి అనకూలంగా వ్యవహారిస్తున్నాయని ఎద్దేవా చేశారు.

సయ్యద్‌ అజీజ్‌ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ పేద వర్గాలకు అనేక కోతలు విధించిందని ధ్వజమెత్తారు. నరేగా, ఆహార సబ్సిడీ, ఫెర్టిలైజర్‌ లాంటి అనేక వాటికి కేంద్రం నిధులను కోత పెట్టిందన్నారు. కూనంనేని సాంబశివ రావు నివేదికను ప్రవేశపెడుతూ ఫాసిస్టు అవశేషాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. సీపీఐ జాతీయ హోదా ఉపసంహరణ ప్రధాని మోడీ కుట్రలో భాగమన్నారు.

ధరణి పోర్టల్‌, రైతుల రుణమాఫీ, ఆర్‌ పోడు భూములు, ఇండ్ల స్థలాలు, నిరుపేదల ఇళ్లు, గ్రామ పంచాయతీ కార్యదర్శుల సమస్యలు, వీఓఎ, విద్యుత్‌ రంగంలోని ఆర్టిజన్‌, సింగరేణి డిఎస్‌ క్వాలిఫై, ఇలా అనేక సమస్యలపై అంశాల వారిగా పోరాటం చేస్తున్నామని తెలిపారు. సమావేశంలో జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News