రాముడు, హనుమంతుడు బీజేపీని శిక్షించారు: కూనంనేని

రాముడు, హనుమంతుడు బీజేపీ రూపంలో ఉన్న చెడును కర్ణాటకలో శిక్షించాడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు.

Update: 2023-05-13 15:39 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాముడు, హనుమంతుడు బీజేపీ రూపంలో ఉన్న చెడును కర్ణాటకలో శిక్షించాడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. కర్నాటక శాసనసభ ఎన్నికల ఫలితాలు దక్షిణాదికే కాకుండా యావత్‌ భారత దేశానికి మార్గదర్శకంగా నిలిచాయని వ్యాఖ్యానించారు. అత్యున్నత పదవిలో ఉండి మతాల పేరుతో ఓట్లు సంపాదించాలని దుర్బుద్ధితో దిగజారి మాట్లాడిన ప్రధానికి ఈ ఫలితాలు చెంపపెట్టులాంటిదని శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. మతం పేరుతో ప్రజల ఆకలి తీరదని, బీజేపీకి దేవుడి మీద నిజమైన ప్రేమ కాదని, ఓట్ల కోసమే మతాన్ని వాడుకుంటుందని, ఇది ప్రజలు గుర్తించారని ఆయన పేర్కొన్నారు.

కర్ణాటకలో ఎక్కడా లేనివిధంగా అవినీతి విలయతాండవం చేసినా ప్రధాని కాని, బీజేపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. నేను తినను, ఇంకొకరిని తిననివ్వబోనని ప్రధాని నినాదం పక్కన పెట్టి తినేవారందరిని బీజేపీలో చేర్చుకున్నారని ఎద్దేవా చేశారు. మహిళలను లైంగికంగా వేధింపులకు గురిచేసేవారు పదవుల్లో, ఎంపీలుగా ఉన్నారని మండిపడ్డారు. అసమానతలను గుర్తించిన ప్రజలు కర్ణాటకలో తగిన తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. కర్నాటకలో ఇప్పుడు కాంగ్రెస్‌ గెలిచిందని, మిగతా రాష్ట్రాలలో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న బలమైన పార్టీలు దేశంలో గెలుస్తాయని చెప్పారు. దేశంలో మొత్తం బీజేపీ తన సొంతంగా 9 రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉన్నదని, ప్రతిపక్ష ముఖ్త, కాంగ్రెస్‌ ముఖ్త భారత్‌ కావాలని రెచ్చిపోయే ఉపన్యాసాలు ఇచ్చారని, ఇప్పుడు కర్ణాటక ప్రజలు చెంపపెట్టు లాంటి తీర్పు ఇచ్చారన్నారు. మతోన్మాదం, దురహంకార పూరితమైన మాటలు భారతదేశ సంస్కృతికి తగవని, వచ్చే లోక్‌సభ ఎన్నికలలో ఇదేవిధమైన తీర్పు ప్రజలు చెబుతారని కూనంనేని ధీమా వ్యక్తం చేశారు.

Tags:    

Similar News