బీఆర్ఎస్‌తో వామపక్షాల దోస్తీ కటీఫ్.. దానికి కేసీఆర్ ఒప్పుకోరని ముందే ఫిక్స్ అయ్యారా?

బీఆర్ఎస్‌తో వామపక్షాల దోస్తీ కటీఫ్ కానుందనే ప్రచారం ఊపందుకుంది.

Update: 2023-02-14 23:45 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్‌తో వామపక్షాల దోస్తీ కటీఫ్ కానుందనే ప్రచారం ఊపందుకుంది. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అడిగినన్నీ టికెట్లు ఇచ్చేందుకు కేసీఆర్ అంగీకరించబోరని, అందుకు సీపీఐ, సీపీఐలు కలిసి బరిలోకి దిగేందుకు కసరత్తు ప్రారంభించాయి. తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఉమ్మడిగా పోటీచేయని వామక్షాలు ఈసారి కలిసి పోటీచేసేందుకు మొగ్గుచూపుతున్నాయి. బలంగా ఉన్న నియోజకవర్గాలపై ఇప్పటికే ఫోకస్ పెట్టాయి. ఖమ్మంలో జరుగుతున్న కాంగ్రెస్ యాత్రకు సీపీఐ శ్రేణులు సంఘీభావం పలకడంతో బీఆర్ఎస్‌తో దోస్తీ కటీఫ్ అనే సంకేతానికి బలం చేకూర్చినట్లయింది. అయితే పార్టీ అధిష్టానం మాత్రం ఈ ఘటనపై స్పందించలేదు. కానీ రాష్ట్ర కార్యవర్గ భేటీ కావడం చర్చనీయాంశమైంది.

బీఆర్ఎస్, వామపక్షాల టార్గెట్ బీజేపీ. అందులో భాగంగానే మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా పొత్తులకు శ్రీకారం చుట్టారు. ఏ ఎన్నికలు అయినా కలిసే పోతామని స్పష్టం చేశారు. కేసీఆర్ సైతం బీఆర్ఎస్‌తో జాతీయ రాజకీయాలకు వెళ్తున్న క్రమంలో దేశంలో కమ్యూనిస్టులతో వెళ్లేందుకు సముఖత వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, వామపక్షాలు మునుగోడులో గెలిచి తొలి అడుగు సక్సెస్ చేశారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయాల్లో వస్తున్న మార్పులతోవామపక్షాలు అడిగినన్నీ సీట్లు కేసీఆర్ ఇవ్వరని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అక్కడక్కడ నోరు జారుతున్నారు. కేవలం నామినేటెడ్ పోస్టులు ఇస్తారని, సిట్టింగ్ సీట్లు ఎట్టి పరిస్థితుల్లో వదులుకునే ప్రసక్తే లేదనే ప్రచారం బీఆర్ఎస్‌లో విస్తృతంగా చర్చజరుగుతున్నది. ఈ విషయం వామపక్షాలకు తెలియడం, కేసీఆర్ సైతం ఎక్కడ కూడా సీట్లు ఇస్తామని కూడా ప్రకటించలేదు.

అయితే గతంలో వామపక్షాలతో భేటీ సందర్భంలో పొత్తులపై చర్చ వచ్చినా దాటవేశారని విశ్వసనీయ సమాచారం. అయితే వామపక్షాలు మాత్రం పట్టుకున్న నియోజకవర్గాల లిస్టును అందజేశారని, కానీ నెలలు గడుస్తున్నా కేసీఆర్ నుంచి రిప్లై రాలేదు. మరోవైపు ఎన్నికల గడువు సమీపిస్తున్న నేపథ్యంలో వామపక్షాలు అలర్ట్ అయ్యాయి. ఇప్పటినుంచే కార్యాచరణ రూపొందించుకోవాలని భావిస్తున్నాయి. అందులో భాగంగానే ఐక్యత కోసం ప్రయత్నాలు మొదలు పెట్టాయి. గతంలో జరిగిన పొరపాట్లు జరుగకుండా చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. అందుకోసం ప్రణాళికలు సైతం రూపొందిస్తున్నారని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. సీపీఐ బలంగా ఏ నియోజకవర్గంలో ఉంటే ఆ నియోజకవర్గంలో సీపీఎం మద్దతు తెలుపనుంది. ఒకవేళ సీపీఎం బలంగా ఉంటే సీపీఐ మద్దతు పలకాలని అంగీకారం చేసుకుంటున్నాయి. కలిసిపోటీ చేసేందుకే మొగ్గుచూపుతున్నాయి. బేధాభిప్రాయాలు రాకుండా చర్యలు చేపడుతున్నాయి.

ఖమ్మం కాంగ్రెస్ యాత్రలోకి లెఫ్ట్ కార్యకర్తలు

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేప‌ట్టిన హాథ్ సే హాథ్ జోడో యాత్ర ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొనసాగుతున్నది. పిన‌పాక నియోజ‌క‌ర్గం ప‌రిధిలో ఈ నెల 13న జరిగిన పాద‌యాత్రలో స్థానిక క‌మ్యూనిస్ట్ పార్టీ నేత‌లు త‌మ పార్టీ జెండాలు పట్టుకొని పాల్గొని మద్దతు తెలిపారు. పార్టీ అధిష్టానం మాత్రం బీఆర్ఎస్‌కు మద్దతు తెలుపుతుండగా ఆ నిర్ణయానికి ధిక్కరించిన కొంతమంది కిందిస్థాయి నేత‌లు యాత్రలో పాల్గొనడం చర్చనీయాంశమైంది. దేశ‌వ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా వ‌చ్చే పార్టీల‌తో క‌లిసి ప‌ని చేయాల‌ని ముందుకు సాగుతున్నారు. అయితే రాష్ట్రంలో ఒక్కసారిగా కాంగ్రెస్‌కు వామపక్ష కార్యకర్తలు మద్దతు తెలపడంతో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శలు అవాక్కయ్యారు. దీనిపై సమీక్ష చేసినట్లు సమాచారం. ఏదీ ఏమైనప్పటికీ ఈ పరిణామం మాత్రం బీఆర్ఎస్‌తో విడిపోవడానికి సిద్ధమయ్యారనే సంకేతాన్ని ఇచ్చినట్లయింది.

ఒకటిరెండు సీట్లు ఇస్తే అవమానమే..

సీపీఎం, సీపీఐ ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాలో బలంగా ఉన్నాయి. మరికొన్ని జిల్లాల్లో గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నాయి. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి వామపక్షాలు కలిసి పనిచేయలేదు. 2014లో సీపీఐ కాంగ్రెస్‌తో, సీపీఎం ప్రజాసంఘాలతో కలిసి పోటీ చేశాయి. కానీ ప్రభావం చూపలేకపోయాయి. అంతేకాదు 2018 ఎన్నికల్లోనూ వామపక్షాలు కలిసి పనిచేయలేదు. అయితే రాబోయే ఎన్నికల్లో కలిసిపనిచేస్తేనే పార్టీలకు పూర్వవైభవం అని భావించి ముందుకుసాగేందుకు సిద్ధమయ్యాయి. అందులో భాగంగానే పొత్తులపై మంగళవారం ఇరుపార్టీల కార్యదర్శలు భేటీ అయ్యారు. సీపీఐ 8 నియోజకవర్గాలు, సీపీఎం 5 నుంచి6 నియోజకవర్గాలు అడుగుతున్నట్లు సమాచారం. అయితే కేసీఆర్ ఒకటిరెండు సీట్లు ఇస్తే అవమానమేనని, అడిగినన్నీ సీట్లు ఇవ్వకుంటే వామపక్షాలు కలిసి పోటీచేసేందుకు సన్నద్ధమవుతున్నాయి. కేసీఆర్ పొత్తులపై ఏదీ చెబితే దానికి తల ఊపొద్దని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. బలం ఉన్న చోట్ల వామపక్షాలకు టికెట్ ఇవ్వాలని పట్టుబట్టాలని భావిస్తున్నాయి.

త్వరలోనే కేసీఆర్‌ను కలిసే ఆలోచన

పొత్తులపై వామపక్షాల నేతలు త్వరలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కలువాలని భావిస్తున్నాయి. నియోజకవర్గాల ప్రతిపాదనను కేసీఆర్ ముందుంచనున్నట్లు సమాచారం. అందుకోసం ఇప్పటికే నియోజకవర్గాల వారీగా పార్టీల ఓటు బ్యాంకు, గత ఎన్నికల ఫలితాలు, వామపక్షాల బలం వివరాలను సేకరించారు. ఆ వివరాలను సైతం కేసీఆర్‌కు అందజేయనున్నట్లు ఓ పార్టీ నాయకుడు తెలిపారు. కేసీఆర్ నుంచి వచ్చే సానుకూలతను బట్టి రాబోయే ఎన్నికల్లో పొత్తులపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. కేసీఆర్ అడిగిన సీట్లు ఇవ్వకపోతే మాత్రం వామపక్ష పార్టీలు విడిపోవడానికి సిద్ధమేనని విశ్వసనీయంగా తెలిసింది.ఏదీ ఏమైనప్పటికీ వామపక్షాల భేటీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ఇవి కూడా చదవండి : ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ మళ్లీ పెండింగ్!

Tags:    

Similar News