BRS మున్సిపల్ చైర్ పర్సన్‌పై అవిశ్వాసానికి కౌన్సిలర్ల పట్టు!
యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ చైర్మన్ ఎరుకల సుధా హేమేందర్ గౌడ్‌పై మున్సిపల్ కౌన్సిలర్లు అవిశ్వాసానికి సిద్ధమయ్యారు.
దిశ,యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ చైర్మన్ ఎరుకల సుధా హేమేందర్ గౌడ్‌పై మున్సిపల్ కౌన్సిలర్లు అవిశ్వాసానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు వారు సోమవారం యాదాద్రి జిల్లా కలెక్టర్ పమేలా సత్పత్తి ని కలిసి వినతిపత్రం అందజేశారు. అయితే ఇటీవల చైర్మన్ పదవి హామీతో కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్‌లోకి పలువురు కౌన్సిలర్లు చేరిన విషయం తెలిసిందే. మరోవైపు ఏడాది వరకు మున్సిపాలీటీల్లో అవిశ్వాసం లేదని ఇటీవల మంత్రి కేటీఆర్ ప్రకటించినప్పటికీ యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని కలెక్టర్‌కు వినతిపత్రం అందజేయడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. వినతిపత్రం అందజేసిన వారిలో యాదగిరిగుట్ట మున్సిపల్ వైస్ చైర్మన్ కాటం రాజు, కౌన్సిలర్లు గుండ్లపల్లి వాణి, ముక్కెర్ల మల్లేష్, దండబోయిన అనిల్, మమత, బూడిద సురేందర్, సీస విజయలక్ష్మి, గౌళికార్ అరుణ, తాళ్ళపల్లి నాగరాజు, బబ్బూరి మౌనిక, మాలోతూ సరోజా తదితరులు ఉన్నారు.