వైరా విద్యుత్‌ శాఖకు అవినీతి మకిలి

విద్యుత్ శాఖ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఓ రియల్ ఎస్టేట్ వెంచర్‌కు విద్యుత్ లైన్ మంజూరు చేశారు.

Update: 2023-04-14 03:34 GMT

దిశ, వైరా : సామాన్యుడి ఇంటికి విద్యుత్ మీటర్ మంజూరు చేయాలంటే సవాలక్ష కొర్రీలు పెట్టి తీవ్ర ఇబ్బందికి గురి చేసే విద్యుత్ శాఖ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఓ రియల్ ఎస్టేట్ వెంచర్‌కు విద్యుత్ లైన్ మంజూరు చేశారు. 2018లో గ్రామపంచాయతీ అనుమతి ఉన్న రియల్ ఎస్టేట్ వెంచర్‌కు ఐదేండ్లు గడిచిన తర్వాత మున్సిపాలిటీ నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్తు లైన్ మంజూరు చేయటం వెనుక లక్షలాది రూపాయలు చేతులు మారినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

వైరా విద్యుత్ శాఖలోని ఓఅధికారి ముడుపుల జాతరకు నిబంధనలను పాతర వేశారని ఆ శాఖలోని సిబ్బంది చర్చించుకోవడం విశేషం. 2018లోనే ఈరియల్ ఎస్టేట్ వెంచర్‌లో నిర్మాణం చేపట్టిన ఓ ఇంటికి నిబంధనలకు విరుద్ధంగా 250 మీటర్లపైగా సర్వీస్ వైరుతో కేటగిరి 2 విద్యుత్ మీటర్ మంజూరు చేయడం గమనార్హం.

విద్యుత్ లైన్ మంజూరు..

వైరాలో అంతర్భాగంగా ఉన్న బ్రాహ్మణపల్లిలో 203/ఏ /1, 203/సీ సర్వే నెంబర్లలో ఉన్న సుమారు ఐదెకరాల్లో 2018లో వైరా పట్టణం సోమవారం మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్నప్పుడు ఆజాద్ వెంచర్‌ను వేశారు. అయితే 2018 ఆగస్టు 2న వైరాను మున్సిపాలిటీగా ప్రభుత్వం అప్ గ్రేడ్ చేసింది. నిబంధనల ప్రకారం వెంచర్ ఏర్పాటు చేసిన వెంటనే విద్యుత్ లైన్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

అయితే ఐదేళ్ల తర్వాత యజమాని చేసిన దరఖాస్తుతో కరెంట్ లైన్ ప్రతిపాదనలు స్థానిక అధికారులు తయారు చేయగా ఉన్నతాధికారులు ఆ ప్రతిపాదన ఆమోదించారు. విద్యుత్ లైన్ మంజూరు చేయాలంటే తప్పనిసరిగా వెంచర్‌కు డీటీసీపీ అనుమతి ఉండాలి. కానీ అధికారుల నిబంధనలకు విరుద్ధంగా పాత పంచాయతీ అనుమతులతోనే విద్యుత్ లైన్లు మంజూరు చేయడం విమర్శలకు తావిస్తున్నది.

మూడేళ్లుగా ఇక్కడ పనిచేస్తున్న ఓ అధికారి అన్నీ తానై విద్యుత్తు లైన్ మంజూరు చేయించారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో లక్షలాది రూపాయలు చేతులు మారాయని బహిరంగంగానే ప్రచారం జరుగుతున్నది. 2022మార్చి నెలలో సదరు రియల్ వ్యాపారి దరఖాస్తుతో విద్యుత్ లైన్ కోసం ప్రతిపాదనలు ఉన్నతాధికారులకు పంపగా దాన్ని తిరస్కరించారు. మళ్లీ గత మార్చి నెలలో ఓఅధికారి 25కేవీ ట్రాన్స్‌ఫారంతో 55స్తంభాలతో పాటు ఇతర విద్యుత్ సామాగ్రికి ప్రతిపాదనను పంపగా 30న విద్యుత్తు లైనుకు ఉన్నతాధికారులు అనుమతులు ఇచ్చారు.

2018లో నిబంధనకు విరుద్ధంగా సుమారు 250 మీటర్ల దూరం సర్వీసు వైరు ఏర్పాటు చేసి ఇచ్చిన మీటర్ కలెక్షన్ ఆధారంగా ఈ విద్యుత్ లైన్‌కు అనుమతులు ఇవ్వడం విద్యుత్ శాఖను అబాసుపాలు చేస్తున్నది. ఈ వ్యవహారంలో అన్ని తానై వ్యవహరించిన అధికారి విద్యుత్ లైన్ మంజూరు విషయం బయటకు ఎలా వచ్చిందని తన కింద సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేయడం విశేషం. ఇప్పటికైనా అధికారులు స్పందించి అనుమతులు ఇచ్చేందుకు ప్రతిపాదనలను పంపిన అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Tags:    

Similar News