ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలలో కరోనా కలకలం
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా కలవరపెడుతోంది.
దిశ, వరంగల్ బ్యూరో : మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో కరోనా కలకలం రేపింది. పాఠశాలలో జ్వరంతో బాధపడుతున్న పలువురు విద్యార్థినులను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్లి కరోనా పరీక్షలు చేయించగా, వారిలో ఒక విద్యార్థినికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఒక్కసారిగా అప్రమత్తమైన సిబ్బంది పాఠశాలలో మంగళవారం వైద్య శిబిరం నిర్వహించారు.
జ్వరం, దగ్గుతో బాధపడుతున్న విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. పాఠశాలలో మొత్తం 172 మంది విద్యార్థినులు, 39 మంది బోధన, బోధనేతర సిబ్బందికి ర్యాపిడ్ టెస్టులు చేశారు. వీరిలో 8 మంది విద్యార్థినులకు పాజిటివ్ రాగా, వారి ఇళ్లకు పంపించినట్లు ప్రిన్సిపల్ జయశ్రీ తెలిపారు. మిగిలిన విద్యార్థినులను ఓ గదిలో ప్రత్యేకంగా ఉంచామని తెలిపారు. కరోనా కేసులు బయటపడిన నేపథ్యంలో పాఠశాలను డీఎంహెచ్‌వో హరీశ్‌రాజ్ సందర్శించారు. కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేలా చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్‌కు సూచించారు.