పొంతన లేకుండా వంతెన నిర్మాణం.. రూ.40 కోట్లతో కట్టినా ఫలితం శూన్యం

మానేరు నదిపై పొంతన లేకుండ వంతెన నిర్మాణం చేయడంతో కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మాణం చేసిన వంతెన అందుబాటులోకి రాకుండ పోయింది.

Update: 2023-02-28 09:20 GMT

దిశ, పెద్దపల్లి: మానేరు నదిపై పొంతన లేకుండ వంతెన నిర్మాణం చేయడంతో కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మాణం చేసిన వంతెన అందుబాటులోకి రాకుండ పోయింది. బీఆర్​ఎస్​ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వెనక ముందు చూసుకోకుండా చేపట్టిన పనులతో కోట్ల రూపాయాల ప్రజాధనం వృధా అవుతుందని ప్రతిపక్ష పార్టీలు నిత్యం దుమ్మెత్తి పోస్తున్నాయి.

ప్రతిపక్షాల ఆరోపణలు నిజం చేస్తూ పెద్దపల్లి జిల్లాలో రూ.40.20 కోట్లతో నిర్మించిన బ్రిడ్జిని అందుబాటులోకి తీసుకురావడానికి రూ.20 కోట్లతో మరో వంతెన నిర్మాణం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. బ్రిడ్జిపై నుంచి భారీ వాహనాలు రాకపోకలు సాగించాలంటే ఇప్పుడు ఆర్​ఓబీ తప్పని సరి కావడంతో అధికారులు ప్రతిపాదనలు సిద్దం చేసి సర్కార్​కు పంపించారు.

పెద్దపల్లి – కరీంనగర్​ జిల్లాలకు సరిహద్దుగా ఉన్న మానేరు నదిపై పలు చోట్ల బ్రిడ్జిల నిర్మాణం చేసి రెండు జిల్లాల గ్రామాలకు వెళ్లే దూర భారం తగ్గించాలని అనేక సంవత్సరాలుగా ప్రజలు కోరుకుంటున్నారు. బ్రిడ్జిల నిర్మాణం కోసం గ్రామాలకు వచ్చిన పలువురి నేతలకు వినతి పత్రాలు సమర్పించారు. చివరకు 2014లో ప్రస్తుత బీఆర్​ఎస్​ అప్పటి టీఆర్​ఎస్​ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్​ మండలంలోని నీరుకుళ్ల, కరీంనగర్​ జిల్లాలోని మానకొండూర్​ మండలం వేగురుపల్లి గ్రామాల మధ్య మానేరు నదిపై బ్రిడ్జి నిర్మాణం సర్కార్​ నిధులు కేటాయించింది.

రూ.40.20 కోట్ల అంచనాతో 2016 జనవరిలో పనులు ప్రారంభించారు. బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి అయి దాదాపు మూడేళ్లు దాటింది. మూడేళ్లు దాటిన మానేరు బ్రిడ్జి ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. ఇందుకు కారణం ఆఫీసర్లకు ముందు చూపు లేకుండా బ్రిడ్జి నిర్మాణం చేయడమే ప్రధాన కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మానేరుపై కొత్తగా కట్టిన బ్రిడ్జి అందుబాటులోకి రావాలంటే ఇప్పుడు నీరుకుళ్ల సమీపంలో రూ.20 కోట్లతో ఆర్​ఓబీ (రైల్వే ఓవర్​ బ్రిడ్జ) నిర్మాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఒక పక్క ఇట్ల.. మరో పక్క అట్లా..

మానేరు నదిపై పెద్దపల్లి, కరీంనగర్​ జిల్లాలను కలుపుతూ నీరుకుళ్ల, వేగురుపల్లి గ్రామాల మధ్య కట్టిన బ్రిడ్జికి రెండు వైపుల ఆప్రోచ్​ రోడ్డు నిర్మాణం పెద్ద సమస్యగా మారింది. మానేరు నదిపై రూ. 40కోట్లతో కట్టిన బ్రిడ్జి విషయంలో ఆఫీసర్లు, లీడర్లకు ముందు చూపులేకుండనే నిర్మాణం చేపట్టారు. బ్రిడ్జిపై నుంచి వాహనాల రాకపోకలు సాగించాలంటే బ్రిడ్జి వరకు ఆప్రోచ్​ రోడ్డు తప్పని సరి. మానకొండూర్​ మండలంలోని వేగురుపల్లి గ్రామం నుంచి మానేరు వరకు సుమారుగా కిలో మీటర్ల ఆప్రోచ్​ రోడ్డు నిర్మాణం చేయాల్సి ఉంది.

ఆప్రోచ్​ రోడ్డు కోసం భూసేకరణ చేసిన ఆఫీసర్లు నిర్వాసితులకు డబ్బులు చెల్లించకపోవడంతో ఆప్రోచ్​ రోడ్డు పనులను స్థానికులు గతంలో అడ్డుకున్నారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తి అయిప్పటికీ ఇప్పటికీ వేగురుపల్లి వైపు ఆప్రోచ్​ రోడ్డు నిర్మాణం పూర్తి కాలేదు. మానేరు బ్రిడ్జి దాటిన తరువాత నీరుకుళ్ల మీదుగా రాజీవ్​ రహదారికి వాహనాలు రావాలంటే పెద్దపల్లి– నిజామాబాద్​ రైల్వే లైన్​ ప్రధాన అడ్డంకిగా మారింది. పెద్దపల్లి – నిజామాబాద్ రైల్వే లైన్​లో అండర్​ బ్రిడ్జిల నిర్మాణం చేశారు. అండర్​ బ్రిడ్జిల కింది నుంచి భారీ వాహనాలు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఆర్ఓబీ తప్పనిసరి అయింది.

రూ. 20 కోట్ల అంచనాలతో ఆర్​ఓబీ ప్రతిపాదనలు

మానేరు నదిపై నిర్మించిన బ్రిడ్జిని అందుబాటులోకి తీసుకువచ్చి లారీలు, బస్సులు వంటి భారీ వాహనాలు నడిచే విధంగా చేయాలంటే పెద్దపల్లి జిల్లా వైపు నీరుకుళ్ల వద్ద ఆర్​ఓబీ నిర్మాణం చేయాల్సి ఉంది. పెద్దపల్లి – నిజామాబాద్​ రైలు మార్గంలో నీరుకుళ్ల వద్ద ఆర్​ఓబీ నిర్మాణానికి రోడ్లు భవనాల శాఖ అధికారులు రూ. 15కోట్ల అంచనాతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు.

కొత్త ఆర్​ఓబీ నిర్మాణం కోసం 8ఎకరాల 20గుంటల భూసేకరణ కోసం పెద్దపల్లి జిల్లా రెవెన్యూ అధికారులు రైతులకు నోటిసులు అందజేశారు. భూసేకరణతో కలుపుకొని ఆర్​ఓబీ నిర్మాణానికి రూ.20కోట్లకు పైగా ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు.

కొంచెం ముందుకు కడితే..

మానేరు నదిపై వేగురుపల్లి, నీరుకుళ్ల గ్రామాల మధ్య కట్టిన బ్రిడ్జి మూడు నుంచి ఐదు కిలో మీటర్ల కిందికి కట్టి ఉంటే ఏలాంటి ఆర్​ఓబీ అవసరం లేకుండానే ప్రజలకు అందుబాటులోకి వచ్చేది. సుల్తానాబాద్​ మండలంలోని గట్టెపల్లి, కదంబాపూర్ మరియు తొగర్రాయి గ్రామాల మధ్య కడితే కరీంనగర్​ జిల్లాలోని ఉటూరు, చల్లూరు మరియు మామిడాలపల్లి గ్రామాలకు కనెక్టివిటి అయ్యేది.

ఆఫీసర్లు ముందుగా ఆలోచన చేసి ఇలా బ్రిడ్జి కట్టి ఉంటే రూ. 20కోట్లు ఖర్చు చేసి ఇప్పుడు ఆర్​ఓబీ కట్టాల్సిన పని లేకుండా పోయేది. వెనుక ముందు ఆలోచన చేయకుండా కట్టిన బ్రిడ్జితో కోట్ల రూపాయాలు ఖర్చు అయినప్పటికీ ఎవ్వరికి ఉపయోగం లేకుండా పోయింది. కొత్త ఆర్​ఓబీ కట్టాల్సిన పని లేకుండా పోయేది.

ప్రభుత్వం నుండి స్పందన కరువు..

మానేరు నదిపై నీరుకుళ్ల, వేగురుపల్లి గ్రామాల మధ్య నిర్మించిన వంతెన అందుబాటులోకి తీసుకురావడానికి రోడ్లు భవనాల శాఖ అధికారులు అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన కరువైయింది. ఇప్పటికైన ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు కల్పించుకొని ఆర్​ఓబీ పనుల కోసం నిధులు కేటాయించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి రైల్వే ఓవర్ బిడ్జ్రి నిర్మాణం పూర్తి చేసి మానేరుపై నిర్మించిన వంతెనను అందుబాటులోకి తీసుకువచ్చి ప్రజలకు దూర భారం తగ్గించాలని పలువురు కోరుతున్నారు.

Tags:    

Similar News