Congress: గత పదేళ్ల పాలన వల్లే ఈ సమస్యలు.. అద్దంకి దయాకర్ హాట్ కామెంట్స్

హైడ్రా, మూసీ వ్యవహారాలలో ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని, ఆక్రమణదారులకు మద్దతుగా బీఆర్ఎస్ పని చేస్తుందని, ప్రజలు ఎవరు భయాందోళనకు గురి కావద్దని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ అన్నారు.

Update: 2024-09-28 13:23 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: హైడ్రా, మూసీ వ్యవహారాలలో ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని, ఆక్రమణదారులకు మద్దతుగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారని, ప్రజలు ఎవరు భయాందోళనకు గురి కావద్దని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ అన్నారు. కూల్చివేతలపై ట్విట్టర్ వేదికగా వీడియో విడుదల చేసిన ఆయన ప్రతిపక్షాలపై ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైడ్రా, మూసీకి సంబంధించిన వ్యవహారాలలో ప్రతిపక్షాలు సంమయమనంతో ఉండాల్సిన అవసరం ఉందని, ప్రజలకు నష్టం చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. కొంతమంది వ్యక్తులు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, ప్రజల్లో భయాందోళనను సృష్టించడం వారికి రివాజుగా మారిందని మండిపడ్డారు. ఎవరు తమ ఆస్తులు పోగోట్టుకున్నా చట్టపరంగా పరిహారం పొందే హక్కు ఉందని, ప్రభుత్వం ఇష్టానుసారంగా కూల్చివేతలు చేయదని వివరించారు. అలాగే మూసీ పరిసర ప్రాంతాల్లో ఐడెంటిఫికేషన్ మాత్రమే జరుగుతుంటే.. అప్పుడే కూల్చివేతలు జరుగుతున్నట్లుగా చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం కూడా ప్రభుత్వ ఆస్తులను గుర్తించి కూలగొడుతున్నది అంతేగానీ వ్యక్తుల ఆస్తులను కూలగొడితే ప్రభుత్వానికి వచ్చే అదనపు ఆదాయం ఏమి లేదని అన్నారు.

కేటీఆర్, హరీష్ రావులు ఆక్రమణలు జరిగిన చోట ప్రజల పక్షాన ఉండాల్సింది పోయి, ప్రభుత్వం తప్పు చేస్తుందని చూపించే ప్రయత్నాలే ఎక్కువ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ 27 వేల ఆక్రమణలు ఉన్నాయని అన్నారని, వారిని రక్షించింది గత ప్రభుత్వమేనా చెప్పాలన్నారు. పేదల పక్షాన నిలబడ్డామని చెబుతూ.. ఆక్రమణదారుల పక్షాన నిలబడే ప్రయత్నాలు చేస్తున్నారా అని ప్రశ్నించారు. బీజేపీ నాయకులు తలా ఒక మాట మాట్లాడుతున్నారని, ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయడానికి బీఆర్ఎస్ కు పరోక్షంగా మద్దతు తెలుపుతున్నారా అని నిలదీశారు. ప్రభుత్వం పనిగట్టుకొని ప్రజా వ్యతిరేక పాలన చేయాల్సిన అవసరం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ చట్టాలను అనుసరించి చేస్తుంటే.. బీజేపీ కూడా రాజకీయాలు చేస్తుందని విమర్శలు చేశారు. బీఆర్ఎస్ వల్లే గత పదేళ్లలో ఈ సమస్యలు వచ్చాయని, మీ వల్లే లక్షల మంది మధ్యతరగతి వాళ్లు ఎఫ్టీఎల్ లో, బఫర్ జోన్ లలో ఏర్పాటు చేసుకున్న నివాసాలు, అపార్ట్‌మెంట్లలో కొనుకున్న ఇళ్లు నష్టపోతున్నారని ఆరోపించారు. అలాంటి వాళ్లకు ఇప్పుడున్న డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వడమే గాక లక్షల్లో ఇళ్లు కట్టించి ఇవ్వడానికి ప్రణాళికలు తయారు చేస్తున్నామని చెప్పారు. ప్రజలు ఎవరు కూడా భయాందోళనకు గురి కావద్దని, ప్రభుత్వం అందరినీ ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.


Similar News