కాంగ్రెస్ స్పెషల్ సీఎల్పీ మీటింగ్‌ నేడే!

కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశ నిర్వహణకు రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రి సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యే ఈ సమావేశానికి రాజకీయ ప్రాధాన్యత నెలకొన్నది.

Update: 2024-09-22 02:24 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశ నిర్వహణకు రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రి సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యే ఈ సమావేశానికి రాజకీయ ప్రాధాన్యత నెలకొన్నది. పీసీసీ చీఫ్‌గా మహేశ్‌కుమార్ గౌడ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత సీఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆయన్ను సన్మానించాలన్నది ప్రధాన ఉద్దేశం. ఈ మీటింగ్‌కు సీఎం రేవంత్ రెడ్డి సైతం హాజరు అవుతున్నందున పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయంతో పాటు పార్టీలోని కొత్త, పాత నేతల మధ్య అభిప్రాయ భేదాలు లేకుండా చూడడంపై దిశానిర్దేశం చేసే అవకాశమున్నది. మాదాపూర్‌లోని ప్రైవేటు హోటల్‌లో జరిగే ఈ కార్యక్రమంలో పార్టీకి సంబంధించిన సంస్థాగత వ్యవహారాలతో పాటు త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీని బలోపేతం చేయడం, ఇంతకాలం పార్టీ కోసం కష్టపడిన శ్రేణులకు అవకాశాలు ఇవ్వడం తదితరాలపై డిస్కషన్ చేయనున్నారు.

కోఆర్డినేషన్ విషయంలో మరింత స్పష్టత

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లా్ల్సిన ఆవశ్యకతపై ఇప్పటికే పీసీసీ చీఫ్ తన అభిప్రాయాన్ని తెలియజేయడంతో పార్టీకి, ప్రభుత్వానికి మధ్య కోఆర్డినేషన్ విషయంలో ఈ మీటింగ్‌లో సీఎం మరింత స్పష్టత ఇచ్చే అవకాశమున్నది. జిల్లా, మండల స్థాయిలోని పేదలకు ప్రభుత్వ పథకాలు అందించడానికి పార్టీ నేతలు, ప్రభుత్వ అధికారులతో జరపాల్సిన సంప్రదింపుల విషయంలో ఇప్పుడు తలెత్తుతున్న చిక్కులపై ఎమ్మెల్యేలు వారి అనుభవాలను ఈ సమావేశంలో ప్రస్తావించే అవకాశం ఉన్నది. ఈ విషయంలో సీఎం రేవంత్ ఇచ్చే క్లారిటీ ఆసక్తికరంగా మారనున్నది.

ఆ ఎమ్మెల్యేల హాజరుపై ఆసక్తి

బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్‌కు అనుకూలంగా మారిన పది మంది ఎమ్మెల్యేల్లో ఎంత మంది ఈ సమావేశానికి హాజరవుతారన్నది ఆసక్తికరంగా మారింది. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై హైకోర్టులో పిటిషన్ విచారణ జరిగిన అనంతరం ముగ్గురిపై వచ్చిన ఫిర్యాదుల విషయంలో తీసుకున్న చర్యలపై క్లారిటీ ఇవ్వాల్సిందిగా స్పీకర్‌ కార్యాలయానికి కోర్టు నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో వీరు ఈ మీటింగ్‌కు హాజరవుతారా.. లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. దీనికి తోడు బీఆర్ఎస్‌కు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరైతే ఎదురయ్యే లీగల్ చిక్కులను దృష్టిలో పెట్టుకుని వారు సైతం అటెండ్ అవుతారా లేదా అనేది కీలకంగా మారింది.


Similar News